ETV Bharat / international

రంగంలోకి బైడెన్‌- గాజాకు మరింత సాయం- అమెరికా వర్సిటీలో పాలస్తీనా జెండా కలకలం! - Israel Hamas News

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 1:35 PM IST

israel hamas war
israel hamas war

Israel Hamas War : గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Israel Hamas War : ఇజ్రాయెల్‌ దాడులతో చిన్నాభిన్నమవుతున్న గాజాలోకి మరింత సహాయ సామగ్రిని చేర్చే దిశగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. ఈ విషయంపై అధ్యక్షుడు జో బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. అతి త్వరలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు హమాస్‌ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ చేపట్టిన యుద్ధంతో గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. దీంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్‌ తాజాగా అంగీకరించింది.

అయితే రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కు కూడా అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్‌ ఈ సందర్భంగా తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేందుకు సహకరించాలని నెతన్యాహుకు ఆయన సూచించారు. హమాస్‌ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు.

తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ భద్రత విషయంలో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజాపై దాడులకు వ్యతిరేకంగా కొద్దిరోజులుగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవి మరింత తీవ్రరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం సృష్టించింది. పాలస్తీనియన్లపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను అమెరికా తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హార్వర్డ్‌లోని ప్రఖ్యాత జాన్‌ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేశారు. వాస్తవంగా దానిపై అమెరికా జెండా ఉంటుంది. లేకపోతే ఎవరైనా విదేశీ ప్రతినిధుల వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. కానీ నిరసనకారులు అమెరికా జెండాను పక్కనపెట్టి పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ జెండాను ఎగరవేశారు. హార్వర్డ్ ప్రతినిధి జొనాథన్‌ ఎల్‌ స్వెయిన్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

ఆ సమయంలో బాగా కుంగిపోయా- సూసైడ్ చేసుకోవాలనుకున్నా: బైడెన్ - Joe Biden Latest Speech

అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనలు తీవ్రం! 550 మంది విద్యార్థులు అరెస్ట్- ఏం జరుగుతోంది? - US Universities Protests

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.