ఒక్కరికే మళ్లీ మళ్లీ వస్తున్న కరోనా.. ఆ ఔషధమే కారణమా?

author img

By

Published : Aug 1, 2022, 7:30 AM IST

Updated : Aug 1, 2022, 2:55 PM IST

biden covid

Paxlovid Medicine: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. అయితే ఆయనకు నాలుగు రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జో బైడెన్​కు చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్‌' అనే ఔషధంపైకి మళ్లింది. కొవిడ్‌ తీవ్రతను వేగంగా తగ్గించే ఈ డ్రగ్‌.. కొన్నిసార్లు వ్యాధి పునరాగమనానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఆ ఔషధం గురించి ఓ సారి తెలుసుకుందాం.

Paxlovid medicine: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల కొవిడ్‌ బారినపడ్డారు. ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు! నాలుగు రోజులు తిరిగేసరికి ఆయన 'నెగిటివ్‌'గా తేలారు కూడా. అయితే- ఇక ఐసొలేషన్‌ నుంచి పూర్తిగా బయటకు వచ్చేయడమే తరువాయి అనుకుంటున్నవేళ ఆశ్చర్యకరంగా బైడెన్‌ తిరిగి ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయ్యారు. వరుసగా నాలుగు రోజులు యాంటీజెన్‌ పరీక్షల్లో 'నెగిటివ్‌' వచ్చిన ఆయన అంతలోనే మళ్లీ 'పాజిటివ్‌'గా తేలడమేంటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అధ్యక్షుడికి చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్‌' అనే ఔషధంపైకి మళ్లింది. కొవిడ్‌ తీవ్రతను వేగంగా తగ్గించే ఈ డ్రగ్‌.. కొన్నిసార్లు వ్యాధి పునరాగమనానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఆ ఔషధం విశేషాలేంటో తెలుసుకుందాం.

ఏమిటీ పాక్స్‌లవిడ్‌?
ఇదొక యాంటీవైరల్‌ ఔషధం. ఫైజర్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. కరోనా భరతం పట్టే అద్భుత ఔషధంగా దీన్ని చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా టీకా తీసుకోనివారికి, వృద్ధులకు వరంగా అభివర్ణిస్తున్నారు. వ్యాధి తీవ్రతను, మృత్యుముప్పును పాక్స్‌లవిడ్‌ గణనీయంగా, చాలా వేగంగా తగ్గిస్తుంది. అమెరికా ఎఫ్‌డీఏ గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

ఎలా తీసుకుంటారు?
పాక్స్‌లవిడ్‌లో నిర్మట్రెల్విర్‌, రిటోనవిర్‌ అనే రెండు రకాల మాత్రలు ఉంటాయి. రెండింటినీ కలిపే ప్యాక్‌ చేస్తారు. నోటి ద్వారా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం.. రెండు నిర్మట్రెల్విర్‌ మాత్రలు, ఒక రిటోనవిర్‌ చొప్పున కలిసి వేసుకోవాలి. కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం లేని వయోజనులకు పాక్స్‌లవిడ్‌ సిఫార్సు చేస్తుంటారు.

.

పనిచేస్తుందిలా..
కణాల్లో కరోనా వైరస్‌ తన సంఖ్యను వేగంగా పెంచుకునేందుకు ప్రొటియేజ్‌ అనే ఎంజైమ్‌ చాలా అవసరం. ఆ ఎంజైమ్‌ పనితీరును నిర్మట్రెల్విర్‌ అడ్డుకుంటుంది. నిర్మట్రెల్విర్‌ వేగంగా ముక్కలవకుండా, శరీరంలో అది ఎక్కువ సమయం ఉండేలా రిటోనవిర్‌ చూస్తుంది. సాధారణంగా కరోనా టీకాలు వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. స్పైక్‌ ప్రొటీన్లు తరచుగా ఉత్పరివర్తనం చెందుతుంటాయి కాబట్టి వ్యాక్సిన్లు వ్యాధి నియంత్రణలో విఫలమయ్యే అవకాశాలుంటాయి. అందుకు భిన్నంగా.. ఉత్పరివర్తనాలకు గురికాని భాగాన్ని నిర్మట్రెల్విర్‌ లక్ష్యంగా చేసుకుంటుంది. అందువల్ల పాక్స్‌లవిడ్‌ అన్ని వేరియంట్లపైనా విజయవంతమైన ఔషధంగా గుర్తింపు పొందుతోంది.

పునరాగమనంపై ఆందోళన..
పాక్స్‌లవిడ్‌ వాడాక కరోనా నెగిటివ్‌గా తేలిన కొన్నిరోజుల్లోనే తిరిగి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటాన్ని 'పాక్స్‌లవిడ్‌ పునరాగమనం'గా పిలుస్తున్నారు. 5-8% వినియోగదారుల్లో ఈ ముప్పు కనిపిస్తోంది. అయితే తిరిగి పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ బాధితుల్లో పెద్దగా అనారోగ్యం ఛాయలు కనిపించడం లేదు. పాక్స్‌లవిడ్‌ పునరాగమన బాధితులు ఐదు రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండాలని అమెరికా ప్రజారోగ్య సంస్థ 'సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)' ఈ ఏడాది మేలో సూచించింది.

అమెరికాలో విరివిగా వినియోగం

అమెరికాలో ప్రతిరోజు వేల మందికి పాక్స్‌లవిడ్‌ను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. 2021 డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై 24 వరకు దేశవ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ఈ ఔషధాన్ని వినియోగించినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  • తీవ్రస్థాయి కొవిడ్‌, మృత్యుముప్పును.. లక్షణాలు బయటపడ్డ మూడు రోజుల్లోపే పాక్స్‌లవిడ్‌ 89% మేర తగ్గిస్తుంది. అందుకే ‘పాజిటివ్‌’ పునరాగమన ముప్పున్నా వైద్యులు చాలామందికి ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు.

బైడెన్‌కు ఏం జరిగిందంటే..ఇటీవల కరోనా బారిన పడ్డ బైడెన్‌.. గత నెల 26న నెగిటివ్‌గా తేలారు. 27, 28, 29 తేదీల్లో నిర్వహించిన యాంటీజెన్‌ పరీక్షల్లోనూ ఆయనలో వైరస్‌ జాడలేవీ కనిపించలేదు. అనూహ్యంగా 30న పాజిటివ్‌ వచ్చింది. అయితే- ఆయనలో వ్యాధి లక్షణాలేమీ లేవు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కూడా పాక్స్‌లవిడ్‌ను వాడాక కొన్ని రోజులకే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

ఇవీ చదవండి: చిక్కుల్లో బ్రిటన్​ ప్రిన్స్​.. బిన్​ లాడెన్​ కుటుంబం నుంచి విరాళం

హిట్లర్‌ వాచీ వేలం.. రూ.కోట్లలో పలికిన ధర.. కొన్నది ఎవరంటే?

Last Updated :Aug 1, 2022, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.