తెలంగాణ

telangana

'ట్రంప్ అరెస్ట్'!.. అలా జరిగితే ఎన్నికల్లో గెలుపు ఆయనదేనని మస్క్ ట్వీట్

By

Published : Mar 19, 2023, 12:52 PM IST

తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మంగళవారం తనను అరెస్ట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.

trump-and-stormy-daniels
trump arrest elon musk tweet

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారని, మద్దతుదారులంతా తన కోసం ఆందోళనకు దిగాలని పిలుపునిచ్చారు. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న ట్రంప్.. వారికి డబ్బులు ఇచ్చి నోరు మూయించారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఈ కేసును విచారిస్తోంది. అయితే, ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రాసిక్యూటర్ల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ట్రంప్ న్యాయవాది పేర్కొనడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు మాత్రం సోషల్ మీడియాలో తన అరెస్టుపై పోస్టులు చేశారు. మంగళవారం (మార్చి 21న) తనను కస్టడీలోకి తీసుకుంటారని తేదీ సైతం చెప్పారు.

బైడెన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆందోళనలకు పిలుపునిచ్చారు ట్రంప్. 'అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ను అరెస్టు చేస్తున్నారని నాకు సమాచారం అందింది. బైడెన్ ప్రభుత్వం ప్రజల్లో అశాంతిని పెంచుతోంది. మన దేశాన్ని వారు చంపేస్తున్నారు. మనం దీన్ని అనుమతించకూడదు. ఇదే తగిన సమయం. అమెరికాను కాపాడుకోవాలి. ప్రొటెస్ట్, ప్రొటెస్ట్, ప్రొటెస్ట్' అంటూ తన ట్రూత్ సోషల్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు ట్రంప్.

ట్రంప్ పోస్టు.. 2020 నాటి క్యాపిటల్ ఘటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అప్పటిలాగే హింసాత్మక నిరసనలకు పరోక్షంగా పిలుపునిచ్చారా అని చర్చించుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం పదవిలో లేని ఆయన కోసం మద్దతుదారులు ఏ మేరకు ఆందోళన చేస్తారనేది తెలియాల్సి ఉందని అంటున్నాయి.

'గెలుపు ఆయనదే'
మరోవైపు, ట్రంప్ అరెస్ట్ వార్తలపై టెస్లా సీఈఓ, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్​ను అరెస్ట్ చేస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధిస్తారని అన్నారు. 2024 ఎన్నికల్లో విజయం ఏకపక్షంగా మారుతుందని జోస్యం చెప్పారు. ట్రంప్​ను అరెస్టు చేస్తారన్న వార్తపై ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన ట్వీట్​కు మస్క్ ఇలా బదులిచ్చారు.

కేసు ఏంటంటే?
2006 సమయంలో ట్రంప్.. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని.. అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు వారికి డబ్బు ముట్టజెప్పారన్నది ప్రధాన ఆరోపణ. వాటి గురించి బయటకు చెప్పకూడదని 2016లో ఆ మహిళలకు డబ్బులు ఇచ్చారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో స్టామీ డేనియల్స్ అనే శృంగార తారతో పాటు, ట్రంప్ న్యాయవాది, మాజీ సలహాదారులను జ్యూరీ ప్రశ్నిస్తోంది. ట్రంప్ ఆదేశాల ప్రకారం శృంగార తారతో పాటు, ఓ మోడల్​కు 2.8 లక్షల డాలర్లు ఇచ్చానని ఆయన న్యాయవాది ఒప్పుకున్నారు. అయితే, ట్రంప్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. వారిని అసలు తాను కలవలేదని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్లను దెబ్బతీసేందుకు డెమొక్రాట్లు చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details