తెలంగాణ

telangana

లాక్‌డౌన్‌తో చైనీయులు ఉక్కిరిబిక్కిరి.. ఆహారం కోసం అరుపులు

By

Published : Apr 11, 2022, 9:04 AM IST

China Coronavirus cases: చైనాలోని షాంఘై నగరంలో కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరిగిపోతుండటం వల్ల లాక్​డౌన్​ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. నగరంలోని 2.5 కోట్ల మందికి నిత్యావసరాలు సరఫరా చేయటం సవాలుగా మారింది. ఆహార కోరతతో బాల్కనీలు, కిటికీల నుంచి అరుపులు, కేకలు, పాటలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

CHINA
లాక్‌డౌన్‌తో చైనీయుల ఉక్కిరిబిక్కిరి

china coronavirus cases: కొవిడ్‌ విజృంభణతో వణికిపోతున్న షాంఘైలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెండున్నర కోట్ల మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం అక్కడి ప్రభుత్వానికి సవాలుగా మారింది. ముఖ్యంగా ఆహారం, నీటితో పాటు ఇతర అత్యవసర వస్తువుల కొరత ఏర్పడడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీంతో భవనాల్లోని బాల్కనీలు, కిటికీల నుంచి అరుపులు, కేకలు, పాటలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం చేస్తున్నారు. వీటితోపాటు పలుచోట్ల సూపర్‌ మార్కెట్ల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అరుపులు, పాటలతో నిరసనలు:చైనాలో కొవిడ్‌కు కేంద్ర బిందువుగా మారిన షాంఘైలో నిత్యం 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70వేల కేసులు బయటపడ్డాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఐదు రోజులేనన్న అధికారులు.. వైరస్‌ ఉద్ధృతి తగ్గకపోవడం వల్ల పది రోజులైనా కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యవసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

డ్రోన్లతో హెచ్చరికలు:లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం, నిత్యవసరాలను స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటి కొరత వేధిస్తోంది. సూపర్‌ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడమే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా కఠిన లాక్‌డౌన్‌ అమలుతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న షాంఘై వాసులు కేకలు వేస్తుండడంపై షాంఘై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వైరస్‌ మరింత వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో డ్రోన్లను రంగంలోకి దింపిన అధికారులు.. 'కోరికలను నియంత్రించుకోండి. పాటలు పాడడానికి కిటికీలు తెరవవద్దు. అలా చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు మరింత పెరుగుతుంది' అంటూ డ్రోన్లతో హెచ్చరికలు చేస్తున్నారు.

అలసటలో వైద్య సిబ్బంది:ఓవైపు ఆహారం, నిత్యవసరాల కొరత ఎదుర్కొంటున్న షాంఘైలో వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐసోలేషన్‌ సెంటర్లలో హజ్మత్‌ సూట్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది తీవ్రంగా అలసిపోతున్నట్లు సమాచారం. తాజాగా ఓ కొవిడ్‌ ఐసోలేషన్‌లో వైద్యుడు కుప్పుకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేషన్‌ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:'ముద్దులు వద్దు.. బాల్కనీలోకి రావద్దు'.. డ్రోన్లు, రోబోలతో చైనా వార్నింగ్స్!

ABOUT THE AUTHOR

...view details