తెలంగాణ

telangana

Palestine President Hamas : హమాస్ మిలిటెంట్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు: పాలస్తీనా అధ్యక్షుడు

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 9:21 AM IST

Palestine President Hamas : హమాస్​కు తమకు ఎలాంటి సంబంధం లేదని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్​ అబ్బాస్ స్పష్టం చేశారు. ఆ సంస్థ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని తెలిపారు. హమాస్​-ఇజ్రాయెల్ పరస్పర దాడుల్ని ఖండించిన అబ్బాస్​.. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న ఖైదీలను, అమాయక ప్రజలను విడిచిపెట్టాలని కోరారు.

Palestine President Hamas
Palestine President Hamas

Palestine President Hamas :ఇజ్రాయెల్- హమాస్​ పరస్పర దాడులపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్​ అబ్బాస్ స్పందించారు. ఇజ్రాయెల్​పై హమాస్​ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని స్పష్టం చేశారు. హమాస్‌ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(అధికార పార్టీ) విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని అబ్బాస్‌ కోరారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్​పై హమాస్‌ దాడుల్ని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్‌ మిలిటెంట్లు అక్కడి ప్రజలను అతి క్రూరంగా చంపేశారు.

అంతకుముందు.. ఈ విషయంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​తో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ చెప్పారు. ఇజ్రాయెల్​పై హమాస్​ దాడిని ఖండించాలని.. హమాస్​ పాలస్తీనీయన్లకు ప్రతినిధి కాదని పునరద్ఘాటించాలని కోరినట్లు తెలిపారు. ఘర్షణ విస్తరించకుండా.. గాజా ప్రజలకు మానవతా సామాగ్రి అందించేలా ఆ ప్రాంతంలోని భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు బైడెన్ వెల్లడించారు.

పౌరులు.. పిల్లలు మూల్యం చెల్లించుకుంటున్నారు: టెడ్రోస్‌ అథనామ్
ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్‌ దాడులు అతి క్రూరమైనవి అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందేని చెప్పారు. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ ప్రజల్ని హమాస్‌ వెంటనే విడిచిపెట్టాలని కోరారు. అలాగే, ఇజ్రాయెల్‌ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని.. లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో విధ్వంసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్న టెడ్రోస్​.. ఉత్తర గాజా నుంచి లక్షలమంది దక్షిణ గాజాకి తరలివెళ్తున్నారని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గాజాలో వెంటనే విద్యుత్‌, నీటి సరఫరాలను పునరుద్ధరించాలని.. ప్రజలకు ఆహారం, మందులు పంపిణీ చేసేందుకు అనుమతించాలని టెడ్రోస్‌ కోరారు.

అది సామూహిక హత్యాకాండకు దారితీస్తుంది..
గాజాపై భారీ భూతల దాడులకు ఇజ్రాయెల్​ సిద్ధమవుతున్న నేపథ్యంలో అరబ్​ లీగ్​, ఆఫ్రికన్ యూనియన్ స్పందించాయి. ప్రణాళిక ప్రకారం గాజా భూభాగంపై దురాక్రమణకు పాల్పడడం.. సామూహిక హత్యాకాండకు దారి తీస్తుందని పేర్కొన్నాయి. దాని పరిణామాలు ఊహించని రీతిలో ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు రెండు సమాఖ్యల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కళ్లెదురుగా కనిపిస్తున్న విపత్తును నిలువరించేందుకు ఐరాస, అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని, పరిస్థితి చేజారిపోయేవరకు ఎదురుచూస్తూ వదిలేయరాదని విజ్ఞప్తి చేశారు.

బేషరతుగా హమాస్​ బందీలను విడిచిపెట్టాలి : ఐరాస చీఫ్​
పశ్చిమాసియా సంక్షోభంపై ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా హమాస్​, ఇజ్రాయెల్​కు రెండు విజ్ఞప్తులు చేశారు. తమ వద్ద ఉన్న బందీలను హమాస్​ బేషరతుగా విడిచిపెట్టాలని ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రెటరీ ఆండోనియో గుటెరస్ అన్నారు. గాజాలోని పౌరులకు త్వరితగతిన, అడ్డంకిలేని మానవతా సహాయం కోసం ఇజ్రాయెల్ అనుమతించాలని చెప్పారు. ఇదే సరైన చర్య అని.. వీటిని ఇరు పక్షాలు అమలు చేయాలన్నారు. ఇవి బేరాసారాలు చేసేందుకు అవకాశంలా మారకూడదని చెప్పారు.

లెబనాన్​ రాకెట్ల దాడి..
ఇదిలా ఇండగా ఇజ్రాయెల్-హమాస్​ యుద్ధం పదోరోజుకు చేరింది. ఆదివారం లెబనాన్​ నుంచి 9 రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. అందులో 5 రాకెట్లను భద్రతా దళాలు విచ్ఛన్న చేశాయని తెలిపారు. అనంతరం ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడి చేసింది.

Gaza Crisis 2023 : గాజా ప్రజల కన్నీటి కష్టాలు.. ఆహారం కోసం పాట్లు.. 'అది వాళ్లకు ఉరిశిక్షతో సమానం'

Israel Hamas War 2023 : యుద్ధంతో ఆస్పత్రులు ఫుల్.. కనీస సౌకర్యాలు లేక అవస్థలు

ABOUT THE AUTHOR

...view details