తెలంగాణ

telangana

ఆర్థిక సంక్షోభంలో పాక్.. మెడపై చైనా 'కత్తి'.. కరెంట్ కోతలు, పెట్రో వాతలు!

By

Published : Jun 19, 2022, 10:26 PM IST

శ్రీలంక తరహాలోనే పాకిస్థాన్‌లోను గడ్డు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కొండంత పేరుకుపోయిన అప్పులు గుది బండగా మారాయి. విద్యుత్తు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. విద్యుత్తు సంస్థలకు పాక్‌ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు గతంలో భారీగా అప్పులు ఇచ్చిన చైనా తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది.

PAKISTAN ECONOMIC CRISIS
PAKISTAN ECONOMIC CRISIS

PAKISTAN ECONOMIC CRISIS: శ్రీలంక మాదిరిగానే పాకిస్థాన్‌ కూడా సంక్షోభం దిశగా పయనిస్తోంది. పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఇప్పటికే తేయాకు దిగుమతికి డబ్బులేనందున టీ తక్కువ తాగాలని ఇటీవల ఓ పాకిస్థాన్‌ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్తు, పెట్రోల్‌, డీజిల్‌ అనవరంగా వృథా చేయొద్దని పేర్కొన్న సింధ్‌ ప్రభుత్వం.. రాత్రి సమయాల్లో దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశించింది. రోజువారీ ఖర్చులకు కష్టంగా ఉందంటూ పాక్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేసింది. విదేశీ మారక నిల్వలు 2.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. కేవలం రెండు నెలల దిగుమతులకు మాత్రమే ఇవి సరిపోతాయని ఇటీవల పాక్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో చైనా వైపు నుంచి ఒత్తిడి పెరిగింది. లాహోర్‌ ఆరెంజ్‌ లైన్‌ ప్రాజెక్టుకు డబ్బులు చెల్లించాలని కోరుతున్న డ్రాగన్‌ వచ్చే ఏడాది నవంబర్‌లోగా చెల్లించాలని గడువు విధించింది. ఈ ప్రాజెక్టుకోసం పాకిస్థాన్‌ 55.6మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది.

పాకిస్థాన్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. రుణాలు కూడా పెద్దఎత్తున ఇచ్చింది. చైనా నుంచి 4.2 బిలియన్‌ డాలర్లు పాకిస్తాన్‌ అప్పు తీసుకుంది. ఇందుకోసం 2021-22లో 150మిలియన్‌ డాలర్లు, 2019-20లో 120మిలియన్‌ డాలర్లు వడ్డీగా చెల్లించింది. ఏప్రిల్‌లో షాబాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పు చెల్లించే విషయమై చైనా నుంచి ఒత్తిడి పెరిగినట్లు పాకిస్థాన్ అధికారవర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌లో విద్యుత్తు సంక్షోభం కూడా తీవ్రరూపం దాల్చింది. స్వదేశీ, విదేశీ విద్యుత్తు సంస్థలకు పాక్‌ ప్రభుత్వం 14 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాయి. చైనా విద్యుత్తు సంస్థలకు పాక్‌ 1.3 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది.

ఇంధన సంక్షోభం నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు, విద్యుత్తును పొదుపు చేసేందుకు కరాచీ నగరంలో ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటలకల్లా అన్నిమార్కెట్లు, బజార్లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, రాత్రి పదిన్నరకల్లా పెండ్లి మండపాలు, రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని పాక్‌ హోంశాఖ హెచ్చరించింది. పాక్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇటీవల కరెంట్‌ కోతలతో కరాచీ వాసులు నిద్రలేని రాత్రులు గడిపారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details