తెలంగాణ

telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి.. గ్యాస్​ లీకై మరో 16 మంది..

By

Published : Jul 6, 2023, 6:41 AM IST

Updated : Jul 6, 2023, 7:27 AM IST

Mexico Bus Accident : మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మరోవైపు, దక్షిణాఫ్రికాలో విష వాయువులు లీకై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ రెండు ఘటనలు జరిగాయి.

mexico-bus-accident-bus-careens-into-gulch-in-mexico-several-died
mexico-bus-accident-bus-careens-into-gulch-in-mexico-several-died

Mexico Bus Crash : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఓక్సాకా రాష్ట్రంలోని మిక్స్‌టెకా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో సంవత్సరన్నర చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని వారు వివరించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్​కు అనుభవం లేకపోవడం, అలసట కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన బస్సు మెక్సికో సిటీ నుంచి మారుమూల కొండప్రాంతాలకు వెళుతోంది. బాధితులంతా కూలీలు అని సమాచారం.

విష వాయువులు లీకై 16 మంది మృతి..
South Africa Gas Leak : దక్షిణాఫ్రికాలో విష వాయువులు లీకై 16 మంది మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరి సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. జొహన్నస్‌బర్గ్​లో బుధవారం ఈ ఘటన జరిగింది.

ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 24 మంది చనిపోయి ఉంటారని అత్యవసర సిబ్బంది తొలుత వెల్లడించారు. అయితే, కాసేపటికే మృతుల సంఖ్య 16 అని ప్రకటించారు. మృతుల సంఖ్యపై గందరగోళం ఎందుకు తలెత్తిందనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం గ్యాస్​ లీక్​ను నిలువరించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అధికారులు వివరించారు.

మృతుల్లో ఏడాది, 6, 15 ఏళ్ల వయస్సున్న చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగర శివారులో ఈ ఘటన జరిగినట్లు వారు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్​ వ్యాపారులు ఓ గుడిసెలో సిలిండర్​ను ఏర్పాటు చేసి బంగారం తయారు చేస్తున్నారని.. అక్కడే ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అయిందనే విషయం తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. లీకైన గ్యాస్​ ఏ రకానికి చెందిందో ఇంకా గుర్తించలేదన్నారు.

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ.. 48 మంది మృతి
Kenya Road Accident : వారం రోజుల క్రితం పశ్చిమ కెన్యాలోనూ ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 48 మంది మృతి చెందారు. రోడ్డుపై నడుస్తున్న పాదచారులపైకి ఓ లారీ దూసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jul 6, 2023, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details