తెలంగాణ

telangana

'రక్తపాతంతో ఎలాంటి పరిష్కారం ఉండదు'

By

Published : May 7, 2022, 10:29 PM IST

Ukraine Russia Conflict: చర్చలు, దౌత్య మార్గంతోనే ఉక్రెయిన్​-రష్యా యుద్ధానికి ముగింపు పలకవచ్చని భారత్​ పేర్కొంది. ఐక్యరాజసమితిలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా ఈ యుద్ధానికి ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపింది.

ukraine russia conflict
ukraine russia conflict

Ukraine Russia Conflict: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నానాటికీ దిగజారుతోన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరిష్కారం చర్చలు, దౌత్య మార్గమేనని అభిప్రాయపడింది. అంతేగానీ, రక్తపాతం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని మరోసారి నొక్కి చెప్పింది.

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరస్థితులపై ఐక్యరాజసమితిలోని భారత శాశ్వత మిషన్‌ కౌన్సిలర్‌ ప్రతీక్‌ మథుర్‌ మాట్లాడారు. "రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా ఈ యుద్ధానికి ఎలాంటి పరిష్కారం లభించదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే ఏకైక మార్గమని ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్‌ చెబుతూనే ఉంది. ఈ హింసను వెంటనే ఆపాలని, శత్రుత్వానికి ముగింపు పలకాలని మేం ఇరు దేశాలను అభ్యర్థిస్తున్నాం. దీని వల్ల ఎవరికీ విజయం లభించకపోదు సరికదా.. అందరికీ నష్టమే" అని తెలిపారు.

బుచాలో రష్యా సేనల మారణహోమాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రతీక్‌ ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు తాము మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా ఉండేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు భారత్‌ అండగా ఉంటుందన్నారు. ఘర్షణలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి పౌరులను తక్షణమే తరలించాలని అన్నారు. ఈ యుద్ధానికి త్వరితగతిన పరిష్కారం లభించేందుకు చేపట్టే చర్యలకు తాము అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల మాస్కో, కీవ్‌ వెళ్లి ఆయా దేశాల అధ్యక్షులతో భేటీ అవడాన్ని భారత్ స్వాగతించింది.

ఏప్రిల్ 26, 28న గుటెరస్‌ మాస్కో, కీవ్‌లో పర్యటించారు. పుతిన్‌, జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ.. భౌగోళిక సమగ్రత ఉల్లంఘనే. ఈ రెండు దేశాలతో పాటు యావత్‌ ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసం ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి’’ అని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి :ఫైవ్​స్టార్​ హోటల్లో భారీ పేలుడు.. 25 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details