తెలంగాణ

telangana

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ.. 6 నెలల తర్వాత తొలి మరణం

By

Published : Nov 20, 2022, 2:52 PM IST

China Covid Restrictions : చైనాలో మరోసారి కరోనా పడగ విప్పుతోంది. గత కొన్నిరోజులుగా కొవిడ్‌ కేసులతో సతమతమవుతున్న డ్రాగన్.. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, ఆంక్షలు విధిస్తోంది. తాజాగా ఓ వృద్ధుడు వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 6 నెలల తర్వాత ఇదే తొలి మరణమని వెల్లడించింది. ఇప్పటికే జీరో కొవిడ్ విధానంతో కఠినంగా వ్యవహరిస్తున్న చైనా అధికారులు.. ఈ ఘటన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చైనీయులు ఆవేదన చెందుతున్నారు.

china covid restrictions
చైనాలో కొవిడ్ ఉద్ధృతి

China Covid Restrictions : చైనాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్‌లో ఓ వృద్ధుడు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 6 నెలల అనంతరం ఇదే తొలి కొవిడ్ మరణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నవేళ.. రోజురోజుకూ చైనాలో పరిస్థితి భిన్నంగా మారుతోంది. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు చైనాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా నగరాల్లో కొవిడ్‌ విజృంభిస్తున్నప్పటికీ.. మరణాలు నమోదు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తర్వాత ఇప్పుడు బీజింగ్‌కు చెందిన 87ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు అక్కడ 92శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే 80ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌తో మరణించిన వారు వ్యాక్సిన్‌ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించలేదు.

మరోవైపు జీరో కొవిడ్ విధానంతో చైనా ప్రజల్లో అసహనం తీవ్రరూపం దాలుస్తోంది. కొవిడ్‌ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆంక్షలు కొనసాగుతున్న ప్రాంతాల్లో 3ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై ఆంక్షలు సడలించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details