బాంబర్లను మోహరించిన అమెరికా.. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగమే కారణం

author img

By

Published : Nov 19, 2022, 10:28 PM IST

Updated : Nov 19, 2022, 10:57 PM IST

us bombing south korea

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేసింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతున్న అమెరికా కొరియా ద్వీపకల్పం లక్ష్యంగా బాంబర్లను మోహరించింది.

ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఉత్తర కొరియా ఖండాతర క్షిపణిని ప్రయోగించి 24 గంటలు ముగియక ముందే.. తమకు మద్దతిస్తున్న అమెరికా.. కొరియా ద్వీపకల్పం లక్ష్యంగా వ్యూహాత్మక బాంబర్లను మరోసారి మోహరించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది.

'దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరియా ద్వీపకల్పంపై అమెరికా వాయుసేనకు చెందిన బీ-1బీ వ్యూహాత్మక బాంబర్లను మళ్లీ మోహరించాం' అని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అత్యాధునిక ఎఫ్‌-35 యుద్ధ విమానాలు కూడా తమ సైనికవిన్యాసాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొంది.

కొరియా ద్వీపకల్పం చుట్టూ అమెరికా, దక్షిణకొరియా చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలను నిరసిస్తూ ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఇది దాదాపు 15 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలిగే సామర్థ్యమున్న ఈ క్షిపణికి.. అమెరికాలోని ప్రధాన భూభాగాలను కూడా నాశనం చేయగల సామర్ధ్యం ఉంది.

అయితే, అమెరికా మోహరించిన బీ-1బీ బాంబర్లు అణ్వాయుధాలను మోసుకెళ్లలేవు. ప్రపంచంలోని ఏప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకొని అణ్వాయుధదాడి చేసేందుకు వీలుగా అమెరికా అభివృద్ధి చేసిన లాంగ్‌ రేంజ్‌ బాంబర్లను వీటి నమూనా ఆధారంగా రూపొందించారు. ఉత్తర కొరియాను తిరుగులేని అణురాజ్యంగా సెప్టెంబరులో కిమ్‌ ప్రకటించిన తర్వాత అమెరికా ప్రాంతీయ భద్రతా సహకారాన్ని అనూహ్యంగా పెంచింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో కలిసి 'విజిలెంట్‌ స్టోమ్‌' పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపడుతోంది.

Last Updated :Nov 19, 2022, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.