తెలంగాణ

telangana

భారత్​లోని భార్య కోసం పడవపై 2వేల కి.మీ.. నీది సముద్రమంత ప్రేమ గురూ!

By

Published : Mar 31, 2022, 2:20 PM IST

Boat Man From Thailand To India: సముద్రయానంలో ఎలాంటి అనుభవం లేదు. అధునాతన సాంకేతికత ఉన్న బోట్​ను కొనే లేదా అద్దెకు తీసుకునే స్తోమత లేదు. ఉన్నదల్లా ఓ చిన్న రబ్బరు పడవ, భార్యపై సముద్రమంత ప్రేమ. ఈ రెండింటితోనే 2వేల కిలోమీటర్ల సాహసోపేత ప్రయాణం ప్రారంభించాడు. ఇంతకీ అతడు గమ్యస్థానాన్ని చేరుకున్నాడా? అసలు ఎందుకు ఇదంతా?

Boat Man From Thailand To India
థాయ్​లాండ్ నుంచి ముంబయికి పడవ ప్రయాణం

Boat Man From Thailand To India: కరోనా.. ఆ యువ జంట మధ్య దూరానికి కారణమైంది. వియత్నాంకు చెందిన ఆ దంపతులు రెండేళ్లు దాటినా ప్రత్యక్షంగా కలుసుకోవడానికి వీలు లేకుండా చేసింది. కరోనా లాక్​డౌన్, ప్రయాణ ఆంక్షలు, ఉద్యోగ సంబంధిత కారణాలతో భార్య ముంబయిలో ఉండిపోవాల్సి వస్తే.. భర్త మాత్రం స్వదేశాన్ని వీడి రాలేకపోయాడు. ఈ ఎడబాటును ఇక ఏమాత్రం భరించలేని ఆ వ్యక్తి.. భారీ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు.

భార్య కోసం థాయ్​లాండ్​ నుంచి భారత్​కు పడవపై హొయాంగ్ హుంగ్ ప్రయాణం

వియత్నాం టు భారత్.. వయా థాయ్​లాండ్​: రెండేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యను ఎలాగైనా కలవాలని అనుకున్నాడు హో హొయాంగ్ హుంగ్. ముందు వియత్నాం నుంచి థాయ్​లాండ్​ వచ్చాడు. బ్యాంకాక్​లోని సువర్ణభూమి విమానాశ్రయానికి వెళ్లి.. ముంబయికి ఓ టికెట్ కొందామనుకున్నాడు. కానీ.. అక్కడే అతడికి షాక్ తగిలింది. వీసా లేదు కాబట్టి విమానం ఎక్కడం కుదరదని తేల్చిచెప్పారు అధికారులు.

విమానయానం అసాధ్యమని భావించిన హొయాంగ్ హుంగ్.. బ్యాంకాక్​లో బస్​ ఎక్కి.. ఫుకెట్ చేరుకున్నాడు. అక్కడ ఓ చిన్న పడవను కొన్నాడు. నిజానికి అది ఓ రబ్బరు షీటు. గాలి కొడితే పడవలా మారుతుంది. పొరపాటున రంధ్రం పడితే అంతే సంగతులు. అయినా.. ఆ రబ్బరు బోటుతోనే తన 'ప్రేమ ప్రయాణాన్ని' మొదలుపెట్టాడు హుంగ్. 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి బయలుదేరాడు.

సవాళ్ల సముద్రం: హుంగ్ ఉద్దేశం మంచిది. అతడి సంకల్పం మహా దృఢమైంది. కానీ.. గమ్యాన్ని చేరేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం అతి క్లిష్టమైంది. హుంగ్ కొన్న పడవకు ఇంజిన్​లు, మోటర్​లు వంటివి ఏమీ లేవు. తెడ్డు ఊపితేనే ముందుకు సాగుతుంది. మరో పెద్ద సవాల్.. నేవిగేషన్. సముద్రయానానికి కంపాస్​లు, జీపీఎస్​ పరికరాలు వంటివి ఎంతో కీలకం. కానీ.. ఇవేవీ హుంగ్ దగ్గర లేవు. అయినా అలానే మొండిగా ముందుకు సాగాడు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. బలమైన ఎదురుగాలుల దెబ్బకు.. ముందుకు వెళ్లాల్సిన పడవ అక్కడక్కడే తిరిగింది. కొన్నిసార్లు వెనుకకూ వెళ్లింది.

18 రోజులు గడిచాయి. ఫుకెట్​లో బయలుదేరిన ప్రాంతం నుంచి అతడు చేరుకున్న దూరం 80 కిలోమీటర్లు మాత్రమే. అయినా అలానే ముందుకు సాగుతున్న హుంగ్.. మార్చి 23న సిమిలన్ దీవుల వద్ద ఓ జాలర్ల బోటులోని వారి కంటపడ్డాడు. వారు నౌకాదళాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన నేవీ సిబ్బంది.. హుంగ్​ను కాపాడారు. తమ బోటులో ఎక్కించుకుని మళ్లీ థాయ్​లాండ్​కు తీసుకెళ్లిపోయారు.

హొయాంగ్ హుంగ్..

2వేల కి.మీ సుదూర ప్రయాణం చేసేందుకు హుంగ్​ వద్ద సరిపడా వనరులు లేవని చెప్పారు నేవీ సిబ్బంది. కొన్ని నీళ్లు, బిస్కెట్స్ వంటి డ్రై ఫుడ్ ప్యాకెట్లు, ఇన్​స్టంట్ నూడుల్స్ మాత్రమే అతడి పడవలో కనిపించాయని వెల్లడించారు. హుంగ్​ గురించి కథనాలు రాస్తూ.. "సముద్రం ఎంత పెద్దదైనా.. ఇతడి ప్రేమను అడ్డుకోలేదు" అని వ్యాఖ్యానించింది థాయ్​ మీడియా.

ఇదీ చదవండి:14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి నివాసం.. ఇంట్లో భార్య ఆ పని చేయనివ్వడం లేదని...

75 ఏళ్ల సూపర్ ఉమన్​.. 10వేల కిలోమీటర్లు సైకిల్​పైనే సవారీ

ABOUT THE AUTHOR

...view details