తెలంగాణ

telangana

భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు.. ఎక్కడంటే?

By

Published : Mar 16, 2022, 7:35 PM IST

Covid cases rising: ప్రపంచవ్యాప్తంగా స్వల్ప విరామం తర్వాత ఒమిక్రాన్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా నిబంధనలు ఎత్తేసిన ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నట్లు హెచ్చరించింది.

Global Covid rates up
భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు

Covid cases rising: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

'కొవిడ్‌ 19 అంతమవుతుందా? లేదా మరింత ఉద్ధృతంగా ఉండబోతోందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానాలు వెతికే ముందు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి' అని మరియా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం.. మార్చి 7-13 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు 8శాతం పెరిగాయి. అత్యధికంగా దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీ దేశాల్లో ఈ పెరుగుదల కన్పించింది.

వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కవగా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలను ఎత్తివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని మరియా వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత, ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందే తప్ప.. వైరస్‌ వ్యాప్తి తగ్గబోదని ఆమె అన్నారు. 'కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో దేశాలను బట్టి భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ మహమ్మారి మాత్రం ఇంకా అంతం కాలేదు. దీనిపై మనమంతా అప్రమత్తంగా ఉండాలి. టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలి. మన ఆరోగ్య కార్యకర్తలను సంరక్షించుకోవాలి. మహమ్మారి అంతం మన చేతుల్లోనే ఉంది' అని మరియా చెప్పుకొచ్చారు.

చైనాలో గత కొద్ది రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కేసులు రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం మరోసారి ఆంక్షల బాటపట్టింది. ఆ దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి:

భారత్​- రష్యా చమురు ఒప్పందం.. అమెరికా ఏమందంటే?

ABOUT THE AUTHOR

...view details