తెలంగాణ

telangana

'చైనాలో భాగం కావటం తప్ప.. తైవాన్‌కు భవిష్యత్తు లేదు'

By

Published : Oct 30, 2021, 4:17 PM IST

చైనాలో భాగం కావటం తప్ప.. తైవాన్​కు వేరే భవిష్యత్తు లేదని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ అన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు రోమ్​కు చేరుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

taiwan
తైవాన్‌

చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.

ఐరాసలో తైవాన్‌కు భాగస్వామ్యం విషయమై అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల మద్దతు తెలిపిన నేపథ్యంలో.. దీన్ని ఖండిస్తూ వాంగ్‌ యీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన రోమ్‌కు చేరుకున్నారు. అమెరికా సహా ఇతర కొన్ని దేశాలు 50 ఏళ్ల క్రితమే 'వన్ చైనా' సూత్రాన్ని ఆపలేకపోయాయని, 21వ శతాబ్దంలోనూ అవి విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. ఈ విషయంలో పట్టుదలతో ఉంటే మాత్రం.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం.

వాస్తవాలను సవాలు చేయలేరంటూ..

తైవాన్‌ను తమ భూమిగా పేర్కొంటూ.. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనా కొన్నాళ్లుగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తైవాన్‌ గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించి.. కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ రెండింటిని ఏకం చేసి తీరతామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సైతం వ్యాఖ్యానించారు. మరోవైపు తైవాన్‌ సైతం డ్రాగన్‌ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తేల్చి చెబుతూ వస్తోంది. చైనా దాడికి దిగితే తైవాన్‌కు తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇదివరకే స్పష్టం చేశారు.

అయితే.. సదరు దేశాలు చైనాతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకునే క్రమంలో ఇచ్చిన రాజకీయ కమిట్‌మెంట్‌ను ఉల్లంఘించటంతోపాటు ఐరాస తీర్మానాన్ని విస్మరిస్తున్నట్లు వాంగ్‌ యీ ఆరోపించారు. చారిత్రక వాస్తవాలను సవాలు చేయలేరని, 1.4 బిలియన్ల చైనా ప్రజల ఆకాంక్షను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని వాంగ్ అన్నారు.

ఇదీ చూడండి:Biden Taiwan: తైవాన్​పై అమెరికా- చైనా మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details