తెలంగాణ

telangana

రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

By

Published : Sep 24, 2020, 8:25 AM IST

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు అబద్ధాలని చైనా విమర్శించింది. ట్రంప్ ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే చేశారని పేర్కొంది. చైనా కూడా వైరస్ బాధిత దేశమే అంటూ చెప్పుకొచ్చింది. డబ్ల్యూహెచ్​ఓను చైనా నడిపిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలనూ తప్పుబట్టింది.

China says Trump's remarks against it full of 'fabricated lies' driven by ‘shady political motives'
రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై చైనా మండిపడింది. చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ట్రంప్ ఆరోపణలన్నీ 'రాజకీయ లబ్ధికోసం చేసిన కల్పిత అబద్దాల'ని తిప్పికొట్టింది.

ఇదీ చదవండి: చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్

ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగం వాస్తవాలను విస్మరించేదిగా ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసేందుకు ట్రంప్ ఐరాస వేదికను ఎంచుకోవడంపై మండిపడ్డారు.

"చైనాకు వ్యతిరేకంగా చేసిన నిరాధారమైన ఆరోపణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అబద్దాలను ఏ విధంగానూ నిజాలుగా మార్చలేరు. కొవిడ్​ను నియంత్రించడంలో చైనా రికార్డు ఏంటో ప్రపంచానికి తెలుసు. మానవాళి అంతటికీ వైరస్ ఉమ్మడి శత్రువు. చైనా కూడా వైరస్ బాధిత దేశమే. మహమ్మారి వ్యతిరేక పోరులో ప్రపంచంతో పాటు చైనా పోరాడింది."

-వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ప్రపంచ ఆరోగ్య సంస్థను పరోక్షంగా చైనానే నడిపిస్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వాంగ్ తప్పుబట్టారు. డబ్ల్యూహెచ్​ఓ నుంచి అర్ధాంతరంగా అమెరికా తప్పుకుందని విమర్శించారు. ఈ నిర్ణయమే .. వైరస్ వ్యతిరేక పోరులో ప్రపంచదేశాల మధ్య సహకారాన్ని ప్రమాదంలో పడేసిందని అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వైరస్​ను రాజకీయం చేయడం, ఇతరులను బలిపశువును చేయడం ఆపేసి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి కరోనా వ్యతిరేక పోరులో పాల్గొనాలని అమెరికాకు హితవు పలికారు.

ఇదీ చదవండి: 'కరోనాను ప్రపంచంపైకి వదిలింది.. చైనాదే బాధ్యత'

మరోవైపు, పర్యావరణ పరిరక్షణకు చైనా పూర్తిగా కట్టుబడి ఉందని వాంగ్ వెన్​బిన్ స్పష్టం చేశారు. 2020- పర్యావరణ లక్ష్యాలను అనుకున్నదానికంటే ముందుగానే సాధించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details