తెలంగాణ

telangana

డ్రోన్లతో హరితహారం- ఒకేరోజు 40 వేల మొక్కలు- ఆ లక్ష్యం కోసం..

By

Published : Feb 9, 2022, 7:02 PM IST

DRONE PLANTING: నానాటికీ పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన బయోటెక్ కంపెనీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రెండేళ్లలో పదికోట్ల చెట్లను నాటేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్​లను వాడుతోంది. ఆకాశం నుంచి విత్తన బంతులను జారవిడవటం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది.

planting by drone
డ్రోన్ల ద్వారా విత్తనాలు

గ్లోబల్​ వార్మింగ్​ తగ్గించడమే లక్ష్యంగా.. డ్రోన్లతో హరితహారం

AUSTRALIA DRONE PLANTING: గ్లోబల్​ వార్మింగ్​.. ఇప్పుడు మానవాళి మనుగడకు అతి పెద్ద సవాలుగా మారింది. భూతాపం రోజురోజుకు పెరుగుతూ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. దీనికి చెక్​ పెట్టాలంటే.. వాతావరణంలో కార్బన్​ డయాక్సైడ్ పరిమాణం తగ్గించాలి. అది చెట్లతోనే సాధ్యం. అన్ని ప్రదేశాలకు వెళ్లి పెద్ద ఎత్తున చెట్లు నాటడం చాలా కష్టమైన పని.

అందుకోసమే.. ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్​సీడ్​ బయోటెక్​ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్ల ద్వారా చెట్లను నాటుతోంది. రెండేళ్లలో 10 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించింది. ఈ పద్ధతిన ఒకే రోజు వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 40 వేల విత్తన బంతులను విసరొచ్చు. స్వల్పకాలంలోనే అవి మొక్కలుగా మారుతాయి.

విత్తన బంతి

"గత ముప్పై సంవత్సరాలుగా గ్లోబల్​వార్మింగ్​పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వాతావరణంలో ఉద్గారాల శాతం బాగా పెరిగిపోయింది. నిరవధికంగా అపారమైన అడవులను పెంచాలి. అప్పుడు కాస్త వాతావరణంలో గ్రీన్​హౌస్​ వాయువుల శాతం తగ్గుతుంది."

- ఆండీ పిట్​మ్యాన్​, ప్రముఖ ప్రొఫెసర్​

ఎయిర్​సీడ్​ కంపెనీ శాస్త్రవేత్తలు శరవేగంగా చెట్లను నాటడానికి కృషి చేస్తున్నారు. కొత్త డ్రోన్లను తయారుచేస్తూ.. కొన్ని సెకన్ల సమయంలో మొక్కలను నాటే విధంగా కొత్త పాడ్​లను రూపొందిస్తున్నారు. మొదట డ్రోన్లతో నాటడానికి అనువైన ప్రదేశాలను మ్యాప్​ చేస్తున్నారు. అనంతరం అక్కడ మట్టి శాంపిల్స్​ను తీసుకొని ల్యాబ్​లో పరీక్షిస్తారు. అక్కడి వాతావరణానికి అనుకూలమైన పాడ్​లను రూపొందించి డ్రోన్ల ద్వారా నాటుతారు.

ల్యాబ్​లో విత్తన బంతుల తయారీ

"డ్రోన్లను ఉపయోగించడం వల్ల అనేక లాభాలున్నాయి. ఒక వ్యక్తి రోజులో 800 చెట్లు నాటగలిగితే.. డ్రోన్​ 40,000 విత్తన పాడ్​లను నాటుతోంది. ముఖ్యంగా అవి ప్రజలకు హానికలిగించని ప్రదేశాల్లో నాటగలవు. కష్టతరమైన ప్రదేశాల్లో సైతం ఇలా మొక్కలను పెంచొచ్చు. మేము అన్ని రకాల మొక్కలను నాటుతున్నాం. వాతావరణం నుంచి కార్బన్ స్థాయిని తగ్గించడంతో పాటు వన్యప్రాణులకు నివాసాన్ని కల్పిస్తున్నాం."

-అండ్రూ వాకర్​, కంపెనీ సీఈఓ

గ్లోబల్​ వార్మింగ్ ఎందుకు పెరుగుతుందంటే..

గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువులలో కార్బన్ డయాక్సైడ్ ఒకటి. సీఓ2 వంటి గ్రీన్​హౌస్​ వాయువులు భూమి వాతావరణంలో వేడిని బంధించి ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనినే గ్లోబల్ వార్మింగ్​ అంటారు. ఎక్కువగా శిలాజ ఇంధనాలను వాడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 30 బిలియన్ టన్నుల కంటే ఎక్కువగా గ్రీన్​హౌస్​ వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి.

"ఉపరితలాల్లో మొక్క నాటడం అనేది నిజంగా సున్నితత్వంతో కూడిన కార్యక్రమం. చాలా కష్టమైన ప్రదేశాల్లో సైతం నాటుతున్నాం. కార్బన్ డయాక్సైడ్ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఊహించిన అనేక విభిన్న పరిష్కారాలలో ఇది ఒకటి. మేము నిజంగా విశ్వసించేది ఏంటంటే, ఒక జీవ వైవిధ్య పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఇది ప్రపంచ మానవాళికి అమూల్యమైనది."

- చార్లెట్​ మిల్స్, కంపెనీ ఎకాలిజిస్ట్​

ఇదొక్కటే పరిష్కారం కాదు.. కానీ!

చెట్లను పెంచడం మాత్రమే ప్రపంచ వాతావరణ సమస్యలకు పరిష్కారం కాదు. పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం కూడా అంతే అవసరం. అందుకే వివిధ దేశాలు సాంకేతికతతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఐలాండ్​లో మొదటి కమర్షియల్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ (DAC) ప్లాంట్ ఉంది. ఆ యంత్రం గాలి నుంచి కార్బన్‌ను పీల్చుకుని భూమిలోపల రాళ్లలో బంధిస్తుంది.

ఎయిర్​సీడ్​ ఇప్పటికే ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు.. సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్‌లో క్రియాశీలకంగా పనిచేస్తోంది. వచ్చే ఏడాది, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఐరోపాలో కార్యకలాపాలను విస్తరించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: విరిగిపడ్డ కొండచరియలు.. బురదలో కూరుకుపోయి 14 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details