తెలంగాణ

telangana

నేడే క్వాడ్ సదస్సు- తొలిసారి దేశాధినేతలతో

By

Published : Mar 12, 2021, 5:36 AM IST

క్వాడ్ కూటమిలోని దేశాల అధినేతలు నేడు వర్చువల్​గా సమావేశం కానున్నారు. కరోనా, ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు వంటి విషయాలపై చర్చించనున్నారు. దేశాధినేతల స్థాయిలో క్వాడ్ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

First Quad Summit to be held today heads of govts of 4 nations to discuss
నేడే క్వాడ్ సదస్సు- తొలిసారి దేశాధినేతలతో

భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(క్వాడ్) సదస్సు నేడు జరగనుంది. నాలుగు దేశాల అధినేతలు తొలిసారి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాళ్లైన కరోనా, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పు అంశాలపై చర్చించనున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌.. క్వాడ్‌ సదస్సులో వర్చువల్​గా పాల్గొననున్నారు. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా దూకుడు, ఆ దేశ సైనిక, ఆర్థిక శక్తి దుర్వినియోగాన్ని కట్టడి చేసే అంశంపైనా దేశాధినేతలు చర్చించనున్నారు. ఇందుకోసం వ్యూహాత్మక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముందని తెలుస్తోంది.

2004లో ఏర్పాటైన క్వాడ్ కూటమి 2007 నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పటికీ.. నాలుగు దేశాల అగ్రనేతలు భేటీలో పాల్గొనడం మాత్రం ఇదే ప్రథమం. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక జో బైడెన్​.. ఓ బహుపాక్షిక సమావేశంలో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి.

చైనా గుర్రు!

క్వాడ్ దేశాల సదస్సుపై చైనా స్పందించింది. కూటమిలోని నాలుగు దేశాధినేతల తొలి భేటీ ఓ ప్రాంతంపై వ్యతిరేకతను పెంచే విధంగా కాకుండా.. ప్రాంతీయ శాంతి, సామరస్యాలను పెంపొందించేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. శాంతి, ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర సహకారం పెంపొందించే విధంగానే ఏ ప్రాంతీయ కూటమైనా పని చేయాలని పేర్కొంది.

ఇదీ చదవండి:చైనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం!

ABOUT THE AUTHOR

...view details