తెలంగాణ

telangana

బైడెన్​ కొత్త ప్లాన్​- వైరస్ కట్టడికి కఠిన నిర్ణయాలు

By

Published : Sep 10, 2021, 11:38 AM IST

అమెరికాపై కరోనా(America Covid Cases) మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​(Joe Biden).. వైరస్​ కట్టడికి నూతన కార్యచరణ ప్రకటించారు. అమెరికన్లందరికీ టీకాలు(America Covid Vaccination) వేయడం, ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం, ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడడంపై ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణాల్లో మాస్క్ ధరించనివారికి జరిమానాను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు.

ameirca biden corona
అమెరికాలో కరోనా కేసులు

అమెరికాలో కరోనా(America Covid Cases) ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ బారి నుంచి అమెరికన్లను రక్షించేందుకు అందరికీ టీకా పంపిణీ(America Covid Vaccination) చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) దృష్టి సారించారు. ఈ దిశగా గురువారం ఆయన నూతన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. టీకా తీసుకోని వారి వల్ల అందరి అమెరికన్లందరి ఆరోగ్యాలు.. ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇప్పటికీ టీకా తీసుకోని అమెరికన్లకు ఇదే నా సందేశం- ఇంకా ఎంత సమయం మీకు కావాలి? ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారు? సురక్షితమైన వ్యాక్సిన్లను మేం ఉచితంగా అందిస్తున్నాం. వాటిని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. మేం ఎన్నోరోజులుగా ఓపికతో ఎదురు చూస్తున్నాం. కానీ, టీకా తీసుకోని వారి వల్ల ఎదురవుతున్న ప్రమాదాన్ని చూస్తోంటే మా ఓపిక నశిస్తోంది."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.

వైరస్​ ముప్పు నుంచి అమెరికాను రక్షించేందుకు అందరూ టీకా వేయించుకోవాలని బైడెన్ కోరారు. "అమెరికాలో 75శాతం మంది కనీసం కరోనా టీకా ఒక డోసైనా వేయించుకున్నారు. కానీ, మిగతా 25శాతం మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదు. వారి సంఖ్య దాదాపు 8 కోట్ల వరకు ఉంటుంది. ఆ 25శాతం మంది వల్ల పెద్ద ప్రమాదం ఉంది." అని బైడెన్ తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పారు. పిల్లలంతా స్వేచ్ఛగా పాఠశాలలకు వెళ్లగలుగుతారన్నారు.

కొత్త నిబంధనలు ఇలా...

ప్రజలంతా వ్యాక్సిన్(America Covid Vaccination) తీసుకునే దిశగా బైడెన్ కొత్త కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. 100 మందికి పైగా ఉద్యోగులు పని చేసే సంస్థలు.. తమ ఉద్యోగులు వారానికొకసారి కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్య సిబ్బందికి సరిపడా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు. అమెరికాలోని ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్లను బైడెన్ ఆదేశించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని చెప్పారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని రకాల ప్రయాణ మార్గాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని బైడెన్ తెలిపారు. మాస్క్​ ధరించని ప్రయాణికులకు జరిమానాను రెట్టింపు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

డబుల్​ ఫైన్..

బైెడెన్ ఆదేశాలతో.. రైళ్లలో, విమానాల్లో, ఇతర ప్రజా రవాణాల్లో మాస్క్ ధరించని ప్రయాణికులకు జరిమానా రెట్టింపు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొదటిసారి మాస్క్ ధరించకుండా చిక్కిన వారికి విధిస్తున్న జరిమానాను 500 డాలర్ల నుంచి 1000 డాలర్లకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. రెండోసారి మాస్క్ ధరించని ప్రయాణికులకు.. అంతకుముందు 1000 డాలర్ల జరిమానా ఉండగా.. దాన్ని 3000 డాలర్లకు పెంచుతున్నట్లు చెప్పారు.

ఆగని ఉద్ధృతి...

మరోవైపు.. అమెరికాలోని వివిధ నగరాల్లో కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అరిజోనా రాష్ట్రంలో కొత్తగా 2,480 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో రోజువారీ కేసులు 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా పదోసారి. వైరస్ ధాటికి మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బాధితులతో ఆ రాష్ట్రంలోని పడకలన్నీ నిండిపోయాయి.

బడిపిల్లలకు టీకా..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాస్​ ఏంజెలస్​ విద్యా శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పాఠశాలలకు వెళ్లే 12 ఏళ్లు దాటిన చిన్నారులందరికీ తప్పనిసరిగా పూర్తి టీకా డోసులు వేయాలని తీర్మానించారు. నవంబర్​ 21 నాటికి వారికి మొదటి డోసు.. 2022 జనవరి 10 నాటికి రెండో డోసు టీకా అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాతో ఆస్పత్రులు ఫుల్​- నెలాఖరు వరకు ఎమర్జెన్సీ

ABOUT THE AUTHOR

...view details