తెలంగాణ

telangana

''రంగ రంగ వైభవంగా' కథ అందుకే ఒప్పుకున్నా'

By

Published : Sep 2, 2022, 6:37 AM IST

తొలి చిత్రం 'ఉప్పెన'తో ఘన విజయం అందుకున్నారు యంగ్​ హీరో వైష్ణవ్‌ తేజ్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా' శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్​ తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

vaishnav tej movies
vaishnav tej new movie ranga ranga vaibhavanga releasing on friday

Vaishnav Tej new movie : "ఫలానా జానర్‌ కథ చేయాలి.. పాన్‌ ఇండియా కథల్లో నటించాలని ప్రత్యేకంగా ప్రణాళికలేం లేవు. నా దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే నన్ను ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నా" అన్నారు వైష్ణవ్‌ తేజ్‌. 'ఉప్పెన'తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి.. తొలి ప్రయత్నంలోనే చక్కటి విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరో ఆయన. ఇప్పుడాయన కేతిక శర్మతో కలిసి 'రంగ రంగ వైభవంగా'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గిరీశాయ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాలు పంచుకున్నారు వైష్ణవ్‌ తేజ్‌.

అరుదుగా వచ్చే కథ..
"దర్శకుడు గిరీశాయ ఈ కథ వినిపించగానే బాగా నచ్చేసింది. స్క్రిప్ట్‌ వింటున్నప్పుడు చాలా నవ్వుకున్నాను. కథతో పూర్తిగా కనెక్ట్‌ అయ్యా. ఇందులో యువతరం మెచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకీ నచ్చే ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచన లేకుండా చేస్తానని చెప్పేశా".

అందుకే ఈ కథే ఒప్పుకొన్నా..
"ఈ చిత్రంలో నేను వైద్య విద్యార్థిగా కనిపిస్తా. నాకు కేతికకు మధ్య ఇగోతో సాగే చక్కటి ప్రేమకథ కనిపిస్తుంది. అందరూ ఇది 'ఖుషి', 'నిన్నే పెళ్లాడతా' ఫ్లేవర్‌లో కనిపిస్తోంది అంటున్నారు. నిజానికి దీనికి ఆ సినిమాలకు ఏ సంబంధం ఉండదు. ఇది పూర్తిగా కొత్త కథ. ఈ కథకే నేను కనెక్ట్‌ అవ్వడానికి కారణం గిరీశాయ ఈ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దిన తీరు. తప్పకుండా మంచి సినిమా అవుతుందనిపించింది".

విలువైన విషయాలు నేర్చుకున్నా..
"ఈ చిత్రంతో చాలా మంది సీనియర్‌ నటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. 'కొండపొలం'లో కొందరు సీనియర్స్‌తో పని చేశాను. ఇందులో ఇంకా ఎక్కువ మందితో నటించగలిగా. నరేశ్‌, ప్రభు, ప్రగతి, తులసి.. ఇలా ప్రతి ఒక్కరి నుంచీ ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. నవీన్‌ చంద్ర ఇందులో ఓ స్పెషల్‌ రోల్‌ చేశాడు. తను సెట్‌ బయట ఒకలా ఉంటారు. షాట్‌ రెడీ అనగానే ఒక్కసారిగా మారిపోతారు. ఇలాంటివి తన నుంచి నేర్చుకున్నా. నేను లెర్నింగ్‌ యాక్టర్‌ని. ఎన్ని సినిమాలు చేసినా.. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందనిపిస్తుంది. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ.. ప్రతి చిత్రం నుంచీ ఏదోకటి కొత్తగా నేర్చుకుంటూనే ముందుకెళ్తుంటా".

టచ్‌ చేయను..
"నా మామయ్యలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల సినిమాలు చూస్తూనే పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్‌ చేయాలని అసలు అనుకోను. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది, నువ్వే చెయ్యాలి అంటే 'బద్రి' రీమేక్‌ చేయాలని ఉంది. అన్నయ్య సాయి తేజ్‌కు నాకు మధ్య అనుబంధం ఎలా ఉంటుందో మా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో మేమిద్దరం అలాగే ఉంటాం. అన్నయ్య నన్నెప్పుడూ ఆటపట్టిస్తూనే ఉంటాడు.
ప్రస్తుతం నేను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. శ్రీకాంత్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది".

ఇవీ చదవండి:'ఆ విషయమే 'బ్రహ్మాస్త్ర'లో నన్ను ఆకట్టుకుంది' : రాజమౌళి

'కోబ్రా'కు కత్తిరింపులు.. ఓటీటీలోకి 'విక్రాంత్‌ రోణ'

ABOUT THE AUTHOR

...view details