Sitaramam movie: 'తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?' అంటూ నటుడు సంతోష్ శోభన్ అసహనం వ్యక్తం చేశారు. 'సీతారామం' సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇది సీరియస్గా అన్న మాట కాదండోయ్.. ఓ పథకం ప్రకారం చాలా సరదాగా చిత్రీకరించిన ఓ వీడియోలోని దృశ్యం. అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం 'సీతారామం'. మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా 'సీతారామం: స్వరాలు' పేరుతో చిత్ర బృందం మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించింది. దీనికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటీవీలో ఇటీవల ప్రసారమైన ఈ వేడుకను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పలు భాగాలుగా విడుదలైన ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సంతోష్ శోభన్ ఫన్నీ కాన్సెప్ట్ వీటిల్లోని ఓ భాగమే.