'పాన్​ ఇండియా కొత్తేమి కాదు.. ఎప్పటి నుంచో నేను..'

author img

By

Published : Aug 3, 2022, 6:36 AM IST

Etv BharDULQUER SALMANat

Seetaramam Dulquer Salman: ప్రతి సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్​. ఆగస్టు 5న 'సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ' అంటూ మన ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని చిత్ర విశేషాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

Seetaramam Dulquer Salman: వైవిధ్య భరితమైన ప్రేమకథలు ఎంచుకుంటూ యువతరంలో ప్రత్యేక క్రేజ్‌ సంపాదించుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. 'మహానటి'తో తెలుగు వారికి దగ్గరైన ఈ మలయాళ స్టార్‌.ఇప్పుడు 'సీతారామం'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమిది. వైజయంతి మూవీస్‌ సమర్పణలో అశ్వినీ దత్‌ నిర్మించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక, సుమంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర విశేషాలు పంచుకున్నారు దుల్కర్‌.

ప్రేమకథలు చెయ్యొద్దనే అనుకున్నా..!
''వరుసగా ప్రేమకథలు చేస్తూ వెళ్లడం వల్ల నాపై ప్రేక్షకుల్లో రొమాంటిక్‌ హీరో అన్న ఇమేజ్‌ పడిపోయింది. దాన్ని బ్రేక్‌ చేయాలన్న ఉద్దేశంతోనే ఇకపై లవ్‌స్టోరీలకు దూరంగా ఉండాలనుకున్నా. హను రాఘవపూడి ఈ 'సీతారామం' కథ వినిపించాక.. నాకు నో చెప్పాలనిపించలే. కచ్చితంగా ఇది నేను చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నా. ఈ స్క్రిప్ట్‌ నాకంత స్పెషల్‌గా అనిపించింది. ఇదొక క్లాసిక్‌ ప్రేమకథ. ఓ ప్రత్యేకమైన కాలంలో జరుగుతుంటుంది. ఇలాంటి లవ్‌స్టోరీ నేనిప్పటి వరకు వినలేదు. ఈ తరహా కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. దీంట్లో స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు ఏమాత్రం అందదు. ట్రైలర్‌లో చూపించింది ఈ సినిమాలోని ఓ చిన్న గ్లింప్స్‌ మాత్రమే. తెరపై చూసినప్పుడు అందరికీ గొప్ప అనుభూతి దొరుకుతుంది. ఇందులో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి''.

DULQUER SALMAN
దుల్కర్​ సల్మాన్​

మలుపు తిప్పే లేఖ..
''ఈ చిత్రంలో నేను లెఫ్ట్‌నెంట్‌ రామ్‌గా కనిపిస్తా. తనొక అనాథ. దేశభక్తి ఉన్న కుర్రాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ లేఖ మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఈ కథ వినగానే సీతామహాలక్ష్మి పాత్రకు ఎవరు సరిపోతారా అనుకున్నా. ఈ పాత్రకు మృణాల్‌ ఠాకూర్‌ను తీసుకున్నామని హను, స్వప్న చెప్పినప్పుడు ఓకే అనుకున్నా. కానీ, సెట్లో సీత కాస్ట్యూమ్‌లో మృణాల్‌ను చూశాక.. ఈ పాత్రకు తను కాకుండా ఇంకెవ్వరూ సెట్‌ అవ్వరనిపించింది. సినిమాలో తనెంతో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. విశాల్‌ చంద్రశేఖర్‌ అద్భుతమైన గీతాలందించారు. ఆ పాటలు వింటున్నప్పుడు 80ల కాలంలోకి వెళ్లినట్లు ఉంటుంది. పాటలనే కాదు.. నేపథ్య సంగీతమూ చాలా కొత్తగా ఉంటుంది. దీంట్లో నాకు చాలా బాగా నచ్చిన పాట 'కానున్న కల్యాణం'. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో.. గడ్డకట్టే చలిలో ఎంతో కష్టపడి చిత్రీకరించిన పాటిది.

DULQUER SALMAN
దుల్కర్​ సల్మాన్​

'పాన్‌ ఇండియా'.. ఎప్పటి నుంచో!
''ఈ పదేళ్ల కాలంలో నేనిప్పటి వరకు 30కి పైగా చిత్రాలు చేశా. నిజానికిది చాలా చిన్న సంఖ్యే. నా సమకాలికులు ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేస్తున్నారు. మా నాన్న ఫిల్మోగ్రఫీ చూస్తే.. ఆయన 80ల్లో ఏడాదికి 30కి పైగా చిత్రాలు చేసిన సందర్భాలున్నాయి. అవి తలచుకున్నప్పుడు.. నేనిప్పుడలా చేయలేకపోతున్నా కదా అనిపిస్తుంటుంది. ఈమధ్య కాలంలో 'పాన్‌ ఇండియా' అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పదం లేకుండా ఏ ఇంటర్వ్యూ, ఆర్టికల్‌ కనిపించడం లేదు. నిజానికి ఈ పాన్‌ ఇండియా ఐడియా మనకు కొత్తేమీ కాదు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలతో ప్రయాణిస్తున్నా. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌ చిత్రాల్ని అందరం చూశాం. అప్పట్లో మా నాన్న చేసిన చాలా సినిమాలు తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఆడాయి. రజనీకాంత్‌ చేసిన సినిమాలు జపాన్‌ వంటి దేశాల్లోనూ ఆదరణ దక్కించుకున్నాయి. ఇదంతా ఎప్పట్నుంచో జరుగుతున్నదే. ఈ మధ్యే పాన్‌ ఇండియా పదాన్ని ఎందుకు ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమాని సినిమా అంటే చాలు. దానికి అదనంగా ట్యాగ్స్‌ తగిలించాల్సిన అవసరం లేదు''.

DULQUER SALMAN
దుల్కర్​ సల్మాన్​, మృణాల్‌ ఠాకూర్‌

ఆయన గర్వపడేలా చేయాలి..
''ప్రేక్షకులు కొత్తదనం నిండిన కథలు కోరుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నా. నా కథల ఎంపికలో నాన్న జోక్యం అసలు ఉండదు. ఓ కథ వినాలంటేనే దాదాపు రెండున్నర గంటలకు పైగా సమయం పడుతుంది. అలాంటిది రోజూ ఐదారు కథలు వినాలంటే చాలా కష్టం. నేను ఏదైనా మంచి కథ ఒప్పుకొంటే.. దాన్ని ఓ లైన్‌గా నాన్నతో పంచుకుంటా అంతే. కెరీర్‌ ఆరంభంలో అందరూ నా హిట్‌ సినిమా కథలన్నీ మా నాన్న ఎంపిక చేశారని, ప్లాప్‌లన్నీ నా సెలక్షన్‌ అని అనుకునేవారు (నవ్వుతూ). నటుడిగా నాకు మా నాన్నే ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. నాకు దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం కచ్చితంగా అది ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుంది''.

ఇవీ చదవండి: సెక్స్​ గురించి కరణ్ ప్రశ్న.. నటి దీటైన రిప్లై.. పంచ్​లతో ఆమిర్ సందడి

'నాటు నాటు' రీక్రియేషన్.. ఈ సిస్టర్స్ స్టెప్పులకు యూట్యూబ్ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.