తెలంగాణ

telangana

'మహానటి'కి ముందు దానికోసమే నన్ను సంప్రదించేవారు: కీర్తి

By

Published : May 12, 2022, 8:32 AM IST

Keerthi suresh Sarkaru vaaripata movie: అవకాశం వస్తే ఓ నటిగా తాను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని తెలిపింది హీరోయిన్​ కీర్తిసురేశ్​. తనకు మాస్‌ అంటే బాగా ఇష్టమని పేర్కొంది. 'సర్కారు వారి పాట' సినిమాతో తనలో మరో కోణాన్ని చూస్తారని చెప్పింది.

Keerthi suresh sarkaru vaaripata movie
సర్కారు వారి పాట

Keerthi suresh Sarkaru vaaripata movie: "నటిగా నాకు ఇది పండగ తరహా సమయం" అంటోంది కీర్తిసురేష్‌. చిత్రసీమలో అవకాశమే కీలకమని, అది వచ్చాక మనం ఏం చేయగలమో అవన్నీ చూపించాల్సిందే అంటోందామె. 'సర్కారు వారి పాట' సినిమాతో కీర్తిసురేష్‌లో మరో కోణాన్ని చూస్తారని చెబుతోంది. ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో చిత్ర విశేషాలను గురించి తెలిపింది. ఆ విషయాలివీ..

"కళావతి పాత్ర నాకు నిజంగానే ఓ పెద్ద బహుమతి. ఇలాంటి పాత్రలు తెలుగులో ఇంతకు ముందు చేయలేదు. నాటీగా కనిపిస్తూ నవ్వించే ఓ వైవిధ్యమైన పాత్ర. నేను తెరపైన కనిపించే సమయమూ ఎక్కువే. ఓ వాణిజ్య సినిమాలో ఇంత ప్రాధాన్యమున్న పాత్ర రావడం అరుదు కదా. తెలుగులో నేను చేసిన సినిమాలూ తక్కువే. 'మహానటి' నా నాలుగో చిత్రం. తమిళంలోనే ఎక్కువ చేశాను. 'మహానటి' తర్వాత నాకు వాణిజ్య ప్రధానమైన సినిమా రావడానికి కొంచెం సమయం పట్టింది. అంతకుముందు 'అజ్ఞాతవాసి' చేశాను కానీ, అందులో ఇలాంటి మాస్‌ పాత్ర కాదు. ఈ పాత్ర కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’’.

"మహేష్‌, నేను కలిసి నటించడం ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి ఓ మాస్‌ పాత్ర చేసి చాలా రోజులైంది. వాణిజ్య సినిమాల్లో లవ్‌ట్రాక్‌ అనేది ఎప్పుడూ విడిగానే ఉంటుంది. ఇందులో కథలో భాగంగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఏడిపించడం, నవ్వించడం అంత సులభం కాదు. పైగా ఇందులో నా పాత్రకి సంభాషణలు ఓ ప్రత్యేకమైన యాసలో రాశారు దర్శకుడు".

"మహేష్‌బాబు చాలా స్వీట్‌. మంచి సహనటుడు. సెట్లో చాలా సాధారణంగా ఉంటారు. సైలెంట్‌గా పంచ్‌లు వేస్తుంటారు. సినిమా, పరిశ్రమ గురించి ఆయనకి చాలా విషయాలు తెలుసు. పక్కనున్న నటులకి మంచి స్పేస్‌ ఇస్తారు. మ మ మహేషా పాటని నేను మహేష్‌ అభిమానిగానే చేశా. ఆ పాట నా జీవితాంతం గుర్తుండిపోతుంది".

"నా కెరీర్‌లో ఈ దశలో ఓ వైవిధ్యం కనిపిస్తోంది. అది నాకు బాగా నచ్చింది. 'చిన్ని' సినిమాలో డీ గ్లామర్‌ పాత్ర, ఇందులో గ్లామర్‌ పాత్ర. నటులకి ఇదే కదా ఛాలెంజ్‌ అంటే. ఒకే సమయంలో ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేసినందుకు నటిగా నాకు ఇదొక పండగ సమయంలా ఉంటుంది. నాలో అన్ని కోణాలూ ఉన్నాయి. ‘మహానటి’కి ముందు అందరూ నన్ను బబ్లీగా సాగే అందమైన పాత్రల కోసమే సంప్రదించారు. అనుకోకుండా ‘మహానటి’ అవకాశం వచ్చింది. ఇప్పుడేమో మళ్లీ నాకు పూర్తిస్థాయి మాస్‌ పాత్రలొస్తున్నాయి. మాస్‌ అంటే నాకు ఇష్టం. అవకాశం వస్తే అన్నీ చేస్తా’"

"చిరంజీవి, రజనీకాంత్‌లతో కలిసి నటించే అవకాశం అరుదుగా వస్తుంది. వాళ్ల సినిమాల్లో చెల్లెలి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నానితో కలిసి ‘దసరా’ సినిమాలో నటిస్తున్నా. అదీ నాలోని నటికి సవాల్‌ విసిరే పాత్ర".అని అన్నారు.

ఇదీ చూడండి:మహేశ్​ 'సర్కారు వారి పాట' టాక్​ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details