తెలంగాణ

telangana

సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం కాదు.. అది నేను నమ్మను: ఎన్టీఆర్​

By

Published : Jul 30, 2022, 6:51 AM IST

Bimbisara: సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలమనే మాటని తాను నమ్మనని, అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ- యాక్షన్‌ చిత్రం 'బింబిసార' ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమాను తన తాతకు అంకితమిస్తానని కల్యాణ్​రామ్​ తెలిపారు.

junior as special guest at bimbisara pre release event
junior as special guest at bimbisara pre release event

Bimbisara Prerelease Event: ''చిత్ర పరిశ్రమకి గడ్డుకాలం అని.. థియేటర్‌కి ప్రేక్షకులు రావడం లేదనీ అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. రానున్న 'బింబిసార'తోపాటు మరో చిత్రం 'సీతారామం'ని ఆదరించి తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోయాలని కోరుకుంటున్నా'' అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'బింబిసార'. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. వశిష్ఠ్‌ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకకి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

''రెండున్నరేళ్ల కిందట ఒక రోజు కల్యాణ్‌ అన్న ఫోన్‌ చేసి 'నాన్నా ఒక ఆసక్తికరమైన కథ విన్నాను, ఒక్కసారి నువ్వు వింటే బాగుంటుంది' అని చెప్పారు. అంతకుముందే వశిష్ఠ్‌ నాకు తెలుసు. కొత్తగా వచ్చాడు, అనుభవం లేదు, ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్‌ చేయగలడా అనే భయం ఉండేది. కానీ ఆ రోజు ఎంత కసితో చెప్పాడో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఈ కథలో ఏం జరగబోతోందో తెలుసు నాకు. అంత తెలిసినా ఈ సినిమా చూసినప్పుడు ఎంతో ఆసక్తి కలిగింది. ప్రతి ప్రేక్షకుడూ అంతే ఆసక్తిగా ఈ సినిమాని చూస్తాడు. 'బింబిసార' చూస్తున్నప్పుడు కొత్త ఛోటా కె.నాయుడు కనిపించారు. ఈ సినిమాకి అన్నీ ఉన్నా ఇంకా ఎక్కడో ఒక చిన్న వెలితి ఉన్నట్టుగా అనిపించేది. ఆ వెలితిని ఎం.ఎం.కీరవాణి తీర్చారు.

.

'బింబిసార' విషయంలో ఇప్పుడు మాకు భయం లేదు, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుత తప్ప! ఈ రోజు అద్భుతమైన చిత్రాలు వస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ఇంత అద్భుతంగా సినిమా రావడం వెనక సాంకేతిక నిపుణులు, నటులే కారణం. ప్రేక్షకులకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటామని ఇదివరకు చెప్పాను. అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అని చెప్పాం. 'బింబిసార' విడుదలయ్యాక నందమూరి కల్యాణ్‌రామ్‌ కాలర్‌ పైకి ఎత్తుతారు. ఈ సినిమాకి ముందు, తర్వాత అన్నట్టుగా ఉంటుంది ఆయన కెరీర్‌. 'బింబిసార' కోసం తన రక్తాన్ని ధారపోశారు. ఒక నటుడిగా తనని తాను మలుచుకున్నారు. కల్యాణ్‌రామ్‌ కాకపోతే మరెవ్వరూ ఆ పాత్రకి న్యాయం చేయలేర''న్నారు ఎన్టీఆర్​. అభిమానుల్ని ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'నాకూ, మా కల్యాణ్‌ అన్నకీ.. మా తాతగారు, మా నాన్నగారు వదిలి వెళ్లిపోయిన అభిమానులు మీరు. ఎప్పటికీ రుణపడే ఉంటాం. జీవితాంతం ఆనందంగా ఉండేలా నడుచుకుంటాం. వర్షాల్లో కంగారుపడకుండాజాగ్రత్తగా ఇళ్లకు చేరండని'' కోరారు.

''మనందరికీ చందమామ, అమరచిత్ర కథలంటే చాలా ఇష్టం. జానపద కథా చిత్రాలంటే ఇంకా ఇష్టం. అది మొదలుపెట్టింది మా తాత ఎన్టీఆర్‌. ఎన్నో సినిమాలు మన ముందుకొచ్చాయి. అదే కోణంలో మేం చేసిన ఓ మంచి జానపద, సోషియో ఫాంటసీ చిత్రమే 'బింబిసార'. తప్పకుండా థియేటర్‌కి వెళ్లండి. ఈసారి మాత్రం ఎవ్వరినీ నిరుత్సాహపరచను. ఈ ఏడాది మా తాతగారి శతజయంతి. తెలుగు సినిమాకి, మాకూ మూలకారకుడైన ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా. కరోనా మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మాకు చక్కటి సహకారం అందించారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. బింబిసార'కి కర్త కర్మ క్రియ నిర్మాత హరికృష్ణ. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను'' అని నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి అవకాశమిచ్చిన కథానాయకుడు కల్యాణ్‌రామ్‌, నిర్మాత హరికి కృతజ్ఞతలు'' అన్నారు.కేథరిన్‌ మాట్లాడుతూ ''చాలా కోణాల్లో 'బింబిసార' నాకు ముఖ్యమైన సినిమా. ఇలాంటి నేపథ్యమున్న సినిమాని నేనిదివరకు చేయలేదు'' అన్నారు. సంయుక్త మేనన్‌ మాట్లాడుతూ ''నేను తెలుగులో ఒప్పుకున్న మొట్ట మొదటి సినిమా ఇదే. ఇందులో భాగం కావడం గర్వంగా ఉంది. కల్యాణ్‌రామ్‌ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఎంతో ఒదిగి ఉంటారు. థియేటర్లో చూడదగ్గ సినిమా ఇది'' అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎం.కీరవాణి, ఛోటా కె.నాయుడు, చైతన్యప్రసాద్‌, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, కిరణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్‌చంద్ర, వైవాహర్ష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:'నా సినిమా షూటింగ్​కే వచ్చి హీరో ఎవరని నన్నే అడిగారు'

ఈ బాలీవుడ్​ స్టార్స్​కు సూపర్​ క్రేజ్​.. కానీ వీరు అసలు భారతీయులే కారు!

ABOUT THE AUTHOR

...view details