తెలంగాణ

telangana

మాస్‌ మొగుడు వీరసింహారెడ్డి ట్రైలర్ డేట్ ఫిక్స్.. స్టైలిష్​ లుక్​లో అమిగోస్‌

By

Published : Jan 2, 2023, 7:18 AM IST

బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా చిత్ర బృందం ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నారు. మరోవైపు, కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మూవీ 'అమిగోస్‌' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా కొత్త ట్రైలర్​ను రిలీజ్ చేసింది ఈ చిత్రబృందం.

Balakrishna Veerasimha Reddy, Kalyan Ram Amigos movies latest updates
బాలకృష్ణ, శ్రుతిహాసన్, కల్యాణ్‌రామ్‌

'వీరసింహారెడ్డి'గా బాలకృష్ణ సందడి అంతకంతకూ రెట్టింపవుతోంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ నెల 6న ఒంగోలులో విడుదల ముందస్తు వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి ముందు ఈ నెల 3న బాలయ్య - శ్రుతిహాసన్‌లపై చిత్రీకరించిన "మాస్‌ మొగుడు" పాట విడుదల చేయనున్నారు. ఈ విషయాల్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న మాస్‌ యాక్షన్‌ కథతో రూపొందిన చిత్రమిది. గోపీచంద్‌ మలినేని తెరకెక్కించారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. దీని సినిమాటోగ్రఫర్​గా రిషి పంజాబీ, ఎడిటర్​గా​ నవీన్ నూలి పనిచేశారు.

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'అమిగోస్‌'. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. జనవరి 1 సందర్భంగా ఆదివారం ఈ సినిమాలోని కొత్త ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అందులో సిద్ధార్థ్‌ అనే పాత్రలో స్టైలిష్‌ లుక్‌తో దర్శనమిస్తున్నారు కల్యాణ్‌రామ్‌. ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మనిషిని పోలిన మనిషిగా ఆయన కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'బింబిసార'తో గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌రామ్‌ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్​గా ఎస్‌. సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్​గా అవినాష్‌ కొల్లా, ఎడిటర్​గా తమ్మిరాజు పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details