తెలంగాణ

telangana

ఎన్టీఆర్​తో కలిసి 100 సినిమాలు చేసిన రికార్డు కైకాలదే

By

Published : Dec 23, 2022, 10:06 AM IST

Updated : Dec 23, 2022, 11:43 AM IST

తెరపై యమధర్మరాజు అయిన ఆయనే ఘటోత్కచుడైనా ఆయనే అనేలా పాత్రలో ఒదిగిపోయేవారు సినీ నటుడు కైకాల సత్యనారాయణ. విలనిజంకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన ఆయన పలు ట్రేడ్​ మార్క్​ క్యారక్టర్లకు ప్రాణం పోసారు. అయితే ఆయన ఓ సీనియర్​ హీరోతో వంద సినిమాల్లో నటించారట. ఆయన ఎవరంటే..

actor kaikala satyanarayana with ntr
actor kaikala satyanarayana

60 ఏళ్లు.. 777 సినిమాలు. ఇది విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ట్రాక్​ రికార్డు. గంభీరమైన రూపుతో తూటాల్లాంటి డైలాగులతో సినీ హీరోలనే తలదన్నేలా ఉండేది ఆయన క్యారక్టర్​. విలనిజానికి మారుపేరుగా నిలిచిన కైకాల ఎన్నో పౌరానికాల్లో నటించి అందరిని మెప్పించారు. అలా దుశ్శాసన, రావణ పాత్రల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయన పూర్తిగా విలన్​ పాత్రలకే పరిమితమైపోయారంటే అది పొరపాటే. ఆయనలో ఓ కరుణా హృదయం కలిగిన ఘటోత్కచుడు కూడా ఉన్నాడు. అన్న మాటే శాసనంగా పాటించిన భరతుడు ఉన్నాడు. అలా నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్కటేంటి కైకాల పోషించని పాత్ర లేదు.

అయితే అప్పట్లో కైకాలను ఎన్టీఆర్​లా ఉండేవారని అనేవారు. అలా ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం వల్ల సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే మోడరన్‌ థియేటర్స్‌ వారి 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటం వల్ల సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్​లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్​లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు.

అలా ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా.. ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్​కు డూప్​గా వ్యవహరించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్ నటించిన సందర్భాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట ఎన్టీఆర్. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు వచ్చినా...తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరటం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనం అంటారు సత్యనారాయణ. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం పాట.. సినిమా పరంగా ఎలా ఉన్నా వాళ్ల నిజజీవిత అనుబంధానికి అద్దం పడుతుంది.

Last Updated : Dec 23, 2022, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details