తెలంగాణ

telangana

woman suicide : నూరేళ్ల జీవితం.. పెళ్లైన మూణ్నెళ్లకే ఆవిరి..!

By

Published : Dec 3, 2021, 4:17 PM IST

Updated : Dec 3, 2021, 6:02 PM IST

woman suicide : ఏడడుగులు.. మూడు ముళ్లు.. నూరేళ్ల కలలతో అత్తవారింట అడుగుపెట్టిన ఆ యువతి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి.. పెళ్లయిన పక్షం రోజుల నుంచే ప్రారంభమైన వేధింపులు ఆ అబల ప్రాణం తీసుకునేదాకా ఆగలేదు.. అదనపు కట్నం వేధింపులతో నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో గురువారం తీవ్ర విషాదం నింపింది..

woman suicide
woman suicide

woman suicide : వరకట్న దాహానికి ఓ నవవధువు బలైపోయింది. పెళ్లైన పదిహేను రోజుల నుంచే అత్తింటి వేధింపులు మొదలవడంతో మానిసికంగా కుంగిపోయింది. వరకట్నం కింద లక్షల్లో కట్నం, తులాల కొద్దీ బంగారం ఇచ్చినా.. మెట్టింటి వారి దాహం తీరలేదు. అత్తమామలకు తోడు కట్టుకున్నవాడు హింసించడంతో నిండు జీవితాన్ని ఉరితాడుతో ముగించుకుంది.

మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌కు చెందిన మారం వెంకన్న, సరోజన దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు పవిత్ర(24)ను మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం ఓదెలు, లక్ష్మి దంపతుల కుమారుడు నరేష్‌కు ఇచ్చి ఆగస్టు 21న పెళ్లి చేశారు. వివాహ సమయంలో రూ.17 లక్షల కట్నం, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనికి రూ.లక్షతో పాటు లాంఛనాలు అప్పగించారు. పెళ్లయిన 15 రోజుల నుంచే అదనపు కట్నం తేవాలంటూ పవిత్రను భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో భర్త నరేష్‌ ఓసారి ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడు.

పెళ్లైన 15 రోజుల నుంచే..

newly married woman suicide : నరేష్‌ కాల్వశ్రీరాంపూర్‌ మండలం గుర్రాంపల్లిలో ఎరువుల దుకాణం నడిపిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినందున రూ.పది లక్షలు కావాలని.. ఆ మొత్తాన్ని దీపావళి కట్నంగా తేవాలంటూ పవిత్రను అత్తింటి వారు శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలపగా వారు వచ్చి పుట్టింటికి తీసుకెళ్లారు. దీపావళికి వచ్చిన అల్లుడికి పవిత్ర తల్లిదండ్రులు రూ.లక్ష ఇచ్చారు. కాగా రూ.10 లక్షలు ఇవ్వాలని గొడవ చేయడంతో పవిత్ర పుట్టింటి వద్దే ఉండిపోయింది.

మనస్తాపంతో ఊపిరి తీసుకుంది

గురువారం తెల్లవారుజామున ఇంటి ముందున్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరి వేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సరోజన కూతురును గమనించి రోదిస్తూ భర్తకు చెప్పింది. ఆయన వచ్చి చూసేసరికే పవిత్ర మృతి చెందింది. పెళ్లయిన మూడు నెలలకే కూతురు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, మంథని సీఐ సతీష్‌, ముత్తారం ఎస్సై రాములు పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పవిత్ర భర్త చిందం నరేష్‌, అత్తమామలు లక్ష్మి, ఓదెలు, బావ సురేష్‌, మరిది రమేష్‌, భర్త మేనమామ రావుల చంద్రయ్య, అత్త పద్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మంథని సీఐ సతీష్‌ తెలిపారు.

ఇదీ చూడండి:Jangaon Road accident news: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Last Updated :Dec 3, 2021, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details