తెలంగాణ

telangana

హైదరాబాద్​లో అడుగడుగునా మత్తు జాడలు.. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు

By

Published : Apr 5, 2022, 8:26 AM IST

Drug Peddlers in Hyderabad: మాదకద్రవ్యాల లావాదేవీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ చిరునామాగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు అనుకూలంగా మారటంతో సాధారణ విద్యార్థి నుంచి కార్పొరేట్‌ ఉద్యోగి వరకూ చేరుతున్నాయి. తేలికగా డబ్బు సంపాదనకు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మత్తుపదార్థాల విక్రయాలను ఎంచుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

drugs transportation in hyderabad
drugs hyderabad

జవహర్‌నగర్‌కు చెందిన భూపతి ప్రమోద్‌ ఐటీ ఉద్యోగి. నెలకు రూ.50,000 వేతనం. బైక్‌పై సీలేరు వెళ్లి హాషిష్‌ ఆయిల్‌ తీసుకొస్తున్నాడు. లీటరు రూ.20,000-30,000కు కొనుగోలు చేసి మిల్లీలీటర్లుగా ప్లాస్టిక్‌ సీసాల్లోకి చేర్చి విక్రయించి లీటర్‌కు రూ.3-4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఎస్‌వోటీ మల్కాజిగిరి తనిఖీల్లో చిక్కి జైలుపాలయ్యాడు.

నిమ్మగడ్డ సాయి విఘ్నేష్‌ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి. డార్క్‌నెట్‌ ద్వారా 20 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ రూ.12,000కు కొనుగోలు చేశాడు. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు ఒక్కో ఎల్‌ఎస్‌డీను రూ.3000కు విక్రయించి 5 రెట్లు లాభం పొందాడు. హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ నిఘాలో పట్టుబడ్డాడు.

Drug Peddlers in Hyderabad: డ్రగ్స్‌ రాకెట్‌లో సామాన్యుడు.. సంపన్నుడు.. విద్యార్థులు.. ఉద్యోగులనే భేదం లేకుండా పోయింది. పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా అపార్ట్‌మెంట్స్‌, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు కూడా మత్తు క్రయవిక్రయాలకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ చిరునామాగా మారింది. హెరాయిన్‌, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తుపదార్థాలు కేవలం ఉన్నత/సంపన్న వర్గాలకే పరిమితమనే అపోహ మాత్రమే అంటున్నారు పోలీసులు. ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో పెద్దఎత్తున డ్రగ్స్‌, పెడ్లర్స్‌ పట్టుబడుతున్నారు. అరెస్టయిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సందర్భాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు అనుకూలంగా మారటంతో సాధారణ విద్యార్థి నుంచి కార్పొరేట్‌ ఉద్యోగి వరకూ చేరుతున్నాయి. ఏటా రూ.లక్షలు సంపాదిస్తున్న ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగులు కూడా తేలికగా డబ్బు సంపాదనకు మత్తుపదార్థాల విక్రయాలను ఎంచుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

స్మైల్‌.. స్వీటీ.. ఫ్రూటీ

ముంబయిలో మత్తుపదార్థాలను సల్మాన్‌, కత్రినా, కిల్లింగ్‌, లంబీ, ఏకే-47 వంటి కోడ్‌ భాషతో పిలుస్తారు. హైదరాబాద్‌లో స్టఫ్‌, వీడ్‌, స్వీటీ, ఫ్రూటీ, టాటూ గుర్తులను కోడ్‌గా ఉపయోగిస్తున్నట్టు తాజాగా పట్టుబడిన కేసుల్లో పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లో యువత మత్తుపదార్థంగా ఉపయోగించే పాపి స్ట్రా కాన్‌సన్‌ట్రేట్‌ (గసగసాలగడ్డి)ని మేడ్చల్‌లోని దాబా నిర్వాహకుడు విక్రయిస్తుండగా రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడ చాలా తక్కువ ధరకు దొరికే దీనితో హెరాయిన్‌ తయారు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు పట్టుబడిన నిందితులు వెల్లడించారు. మిగిలిన మత్తుపదార్థాలు గ్రాము ఉపయోగిస్తే దీన్ని 3-4 గ్రాములు ఉపయోగిస్తే అంతటి కిక్‌ ఇస్తుందంటున్నారు పోలీసులు. పంజాబ్‌లో దీన్ని ‘స్మైల్‌’ కోడ్‌ భాషతో పిలుస్తారు. అది నాలుక మీద పడగానే నవ్వుతూ ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. పంజాబ్‌లో విరివిగా పండించే పాపి స్ట్రా కాన్‌సన్‌ట్రేట్‌లో పువ్వులు, కాయలు, ఎండిపోయిన చెట్టు ప్రతి స్థాయిలోని ముడిసరకు హెరాయిన్‌ తయారీకి ఉపయోగిస్తుంటారు. వాటిని అక్రమంగా కొనుగోలుచేసిన కొందరు పొడిగా మార్చి నగరానికి చేరవేస్తున్నారు. నగర శివార్లలోని కొందరు ఫార్మాసిస్టులు దీన్ని కొనుగోలు చేసి తమ సొంత ల్యాబ్‌ల్లో మార్ఫిన్‌/హెరాయిన్‌గా మార్చి అడ్డదారుల్లో విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రూ.50,000-60,000 పెట్టుబడితో 9-10 రెట్ల లాభాలు రావటంతో అప్పటికే డ్రగ్స్‌కు అలవాటుపడిన వారు డబ్బు సంపాదనకు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎండు గంజాయి సరఫరాతో పోల్చితే హాషిష్‌ ఆయిల్‌ రవాణా చాలా తేలిక. ఏవోబీ, విశాఖపట్టణం, అదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాషిష్‌ ఆయిల్‌ ఇక్కడకు చేరుతున్నట్టు రాచకొండ ఎస్‌వోటీ అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details