ETV Bharat / entertainment

'ఆ పబ్​ పార్టీలో నా పేరెలా బయటకు వచ్చిందో తెలియదు'

author img

By

Published : Apr 5, 2022, 6:47 AM IST

Hero movie Ashok Galla
అశోక్​ గల్లా

Ashok Galla debut movie: హీరో సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు యువ కథానాయకుడు అశోక్​ గల్లా. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్​లో విలేకర్లతో ముచ్చటించారు అశోక్​ గల్లా. పాన్​ ఇండియా చిత్రాల గురించి పెద్దగా ఆలోచించని, నటుడిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు.

Ashok Galla debut movie: "పాన్‌ ఇండియా చిత్రాల గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. ముందు నటుడిగా నేనొక చోట నిలబడాలి అనుకుంటున్నా. అందుకు మంచి కథలు, పాత్రలు చేయడమే నా ముందున్న కర్తవ్యం" అన్నారు అశోక్‌ గల్లా. మహేష్‌బాబు మేనల్లుడైన ఆయన.. 'హీరో' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అశోక్‌ గల్లా. ఆ విశేషాలివి..

'హీరో' సినిమా ఫలితం సంతృప్తినిచ్చిందా?

" ఈ చిత్ర సక్సెస్‌తో వృత్తిపరంగా సంతృప్తి చెందాను. మామూలుగా పండగ రోజుల్లో ప్రేక్షకులు బాగా థియేటర్లకు వచ్చేవారు. కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఎక్కువగా రాలేదని కొద్దిగా నిరుత్సాహం ఉంది. వాస్తవానికి కొవిడ్‌ మార్చిలో ఎక్కువవుతుంది అనుకున్నాం. జనవరిలోనే బాగా పెరిగిపోయింది. ఏదేమైనా ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి కదా.. అందుకే మరీ అంతగా బాధపడలేదు".

నటుడిగా ఎలాంటి ప్రశంసలు దక్కాయి? మహేష్‌బాబు ఏమన్నారు?

"సినిమా చూసిన ప్రతిఒక్కరూ నటన పరంగా చాలా మెచ్చుకున్నారు. వాళ్ల ప్రశంసలు వింటుంటే నాపై నాకే మరింత నమ్మకం వచ్చింది. మోటివేషన్‌ ఎక్కువైంది. ఇంకా బాగా చేయాలన్న తపన రెట్టింపైంది. మహేష్‌బాబు సినిమా చూసి.. 'ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యు..' అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. సినిమా గురించే చాలా మాట్లాడారు. కంటిన్యుటీలో చిన్నపాటి తప్పిదాలు ఉంటే చెప్పారు".

ప్రయోగాత్మక కథలతో ప్రయాణించాలనుందా? కమర్షియల్‌ హీరోగా నిలబడాలనుందా?

"నేను ఓ ఇమేజ్‌ ఛట్రంలో ఉండాలనుకోవట్లేదు. కమర్షియల్‌ సినిమాలే కాదు.. అన్ని రకాల జానర్స్‌ ప్రయత్నించాలనుకుంటున్నా. 'హీరో' సినిమాతో నిరూపించుకున్నాక నాపై నాకు నమ్మకం మరింత పెరిగింది. ఇకపై మరింత భిన్నమైన కథలు, పాత్రలు ఎంపిక చేసుకోవాలి. ఇంటెన్సిటీ ఉండే కథలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ముందుగా ఏది మొదలవుతుందన్నది జూన్‌లో తెలియజేస్తాను".

రెండు రోజుల క్రితం పబ్‌ ఇష్యూలో మీపేరు బయటకొచ్చింది. దానిపై ఏమంటారు?

"ఆరోజు రాత్రి నడుము నొప్పికి ఫిజియోథెరపీ చేయించుకుని.. హాయిగా ఇంట్లోనే నిద్రపోయాను. ఉదయం లేచే సరికి టాస్క్‌ ఫోర్స్‌ దాడి చేసిన ఆ పబ్‌ రేవ్‌ పార్టీలో నేనూ ఉన్నట్లు వార్తలు కనిపించాయి. సడన్‌గా నా పేరు వార్తల్లోకి అలా ఎలా వచ్చిందో తెలియలేదు. అప్పుడు హీరో అనే ఫీలింగ్‌ కలిగింది. సెలబ్రిటీ లైఫ్‌లో ఉంటే ఇలానే వస్తుంటాయనిపించింది".

మహేష్‌ సినిమాల్లో ఏదైనా రీమేక్‌ చేయాలనుందా? వెబ్‌సిరీస్‌ చేసే ఆలోచనలున్నాయా?

"అలా రీమేక్‌ చేసే అవకాశమొస్తే 'మురారి' చేయాలనుకుంటా. ఎందుకంటే అలాంటి సినిమా మళ్లీ రాలేదు. భవిష్యత్తులోనూ రాదు. మంచి కథతో వస్తే కచ్చితంగా వెబ్‌సిరీస్‌ చేస్తా. ఎందుకంటే నటుడిగా అదొక కొత్త అనుభూతినిస్తుంది. ఇప్పటి వరకైతే నన్నెవరూ వెబ్‌సిరీస్‌ కోసం సంప్రదించలేదు".

ఇదీ చూడండి: నాటు నాటు పాటకు రాజమౌళి స్టెప్పులు అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.