తెలంగాణ

telangana

Cybercriminals: బావ డేటా ఇస్తే.. బామ్మర్ది లూటీ చేశాడు!

By

Published : Nov 18, 2021, 10:47 AM IST

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్‌ నంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు. ఇటీవలె ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నకిలీ సేవా కేంద్రాల పేరిట మోసం చేసి.. ఓ బావా బామ్మర్దులు రూ.3 కోట్లు కొల్లగొట్టారు.

Cybercriminals
rbl-credit-card

బావా బామ్మర్దులిద్దరు కలిసి వందలాది మంది రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆర్‌బీఎల్‌) క్రెడిట్‌ కార్డుదారుల (rbl credit card holders)ను మోసగించి రూ.3 కోట్లు కొల్లగొట్టిన ఉదంతమిది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉంటున్న దీపక్‌చౌదరి ఏడాది నుంచి ఓ కాల్‌సెంటర్‌ నిర్వహిస్తూ.. రుణాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని దీపక్‌ బావ, ఆర్‌బీఎల్‌ బ్యాంకు అధికారి భాటియా గుర్తించాడు. తన బ్యాంక్‌లోని లక్షల మంది క్రెడిట్‌ కార్డుదారుల (rbl credit card holders) సమాచారం(డేటా) ఇస్తానని, ఇద్దరం కలిసి మోసాలు చేద్దామంటూ ప్రతిపాదించాడు.

అంగీకరించిన దీపక్‌చౌదరి 6 నెలల క్రితం దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని హోటళ్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున టెలీకాలర్లను నియమించాడు. వారు ఆర్‌బీఎల్‌ వినియోగదారుల సేవాకేంద్రాల అధికారుల పేర్లతో ఆర్‌బీఎల్‌ క్రెడిట్‌ కార్డుదారులకు (rbl credit card holders) ఫోన్లు చేయడం ప్రారంభించారు. రుణపరిమితి పెంచుతాం, బీమా సౌకర్యం కల్పిస్తాం, కార్డు అప్‌డేట్‌ చేసుకోండి అంటూ ప్రతిపాదించేవారు. స్ఫూఫింగ్‌ పరిజ్ఞానంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ వినియోగదారుల సేవాకేంద్రం ఫోన్‌ నంబర్‌ బాధితుల ఫోన్లలో కనిపిస్తుండడంతో టెలీకాలర్లు చెప్పిన మాటలను వందలమంది నమ్మారు. కోడ్‌ నంబర్‌ వస్తుంది అని చెప్పగానే… ఓటీపీలు చెప్పేశారు. ఇలా బాధితుల నుంచి ఎంత వీలైతే అంత సొమ్మును స్వాహా చేసేశారు. ఈ మొత్తాన్ని తమ ఖాతాల్లో వేసుకుంటే పోలీసులకు దొరికిపోతామని అంచనా వేసి సొంత ఈ-కామర్స్‌ సైట్లను సృష్టించారు. బాధితులు ఆ వెబ్‌సైట్‌లో వస్తువులు, దుస్తులు, పరికరాలు, యంత్రాలు కొన్నట్టుగా చూపించారు. ఇందుకోసం నిందితులు విశాల్‌కుమార్‌, క్రిషన్‌, కరణ్, గౌరవ్‌, దుర్గేశ్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. బాధితుల నుంచి కొట్టేసిన నగదును తీసుకునేందుకు నకిలీ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ కార్డులు సమీకరించుకున్నారు. వీటి ఆధారంగా సిమ్‌కార్డులు తీసుకుని దిల్లీలోని వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను తెరిచారు. సొంత ఈ-కామర్స్‌ సైట్లలోని నగదును బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసి ఎప్పటికప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకుంటున్నారు.

నగరంలో 34 కేసులు

వీరి మోసాలపై హైదరాబాద్‌లో 34, దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసు అధికారులు రెండురోజుల క్రితం దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఓ హోటల్‌లోని కాల్‌సెంటర్లలో దాడులు నిర్వహించారు. 16మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 కార్లు, ఒకబైక్‌, 865 నకిలీ ఓటర్‌, ఆధార్‌, పాన్‌కార్డులు, వెయ్యి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి, ఆర్‌బీఎల్‌ బ్యాంకు (rbl credit card holders) అధికారి సహా మరో ఆరుగురు నిందితులు పారిపోయారని స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. వీరి బ్యాంకు ఖాతాల్లోని రూ.15లక్షలు స్తంభింపజేశామని డీసీపీ(నేరపరిశోధన) రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details