ETV Bharat / crime

Cyber Crime : ఏంటి సైబర్​ మోసాలకు ఇలా చిక్కుకుంటున్నారా?

author img

By

Published : Nov 17, 2021, 5:29 PM IST

దొంగ చేతికి తాళాలందించటం! సైబర్ నేరాలకు (Cyber Crime) మూల కారణమిదే. మనంతట మనమే రహస్యాలు బహిర్గతం చేసి...దోచుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాం. కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కొందరు అనాలోచితంగా బాధితులుగా మారుతుంటే మరికొందరు అత్యాశతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు ఇంత సులువుగా ఇలా ఎలా మోసం చేయగలుగు తున్నారు? వాళ్లు వేసిన వలలో కొందరు ఎలా చిక్కుకుంటున్నారు? ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు పెరగటం మొదలైనప్పటి నుంచి ఇవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అందుకే...రిజర్వ్ బ్యాంక్‌ ప్రత్యేకంగా ఈ అంశాలపై నివేదిక రూపొందించింది. డిజిటల్ మోసాలు తీరుతెన్నులపై సమగ్ర వివరాలు అందించింది.

Cyber Crime
Cyber Crime

మనం డౌన్‌లోడ్ చేసే యాప్‌లే మోసపోవటానికి కారణమవుతున్నాయా? సమాచారం కోసం వెతికే వెబ్‌సైట్లే...వలలో చిక్కేలా చేస్తున్నాయా? సైబర్ నేరాల (Cyber Crime) సరళి పరిశీలిస్తే...అవుననే అనిపిస్తోంది. డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా మన గుట్టు పట్టేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం కంప్యూటర్‌లో వెబ్‌సైట్లు వెతుకుతుంటే.. మధ్యలో చొరబడి మాల్‌వేర్‌ వలలు విసిరి మన సమాచారం తస్కరిస్తున్నారు. ఒక్కసారి సమాచారం మోసగాళ్ల (Cyber Crime) చేతికి చిక్కిందా.. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోయినట్లే. ఈ తరహా మోసాలపై ఆర్‌బీఐకి, ఆర్‌బీఐ నియమించిన బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మ్యాన్‌ కార్యాలయం డిజిటల్‌ మోసాల తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది.

అవి డౌన్‌లోడ్‌ చేసుకుంటే...

ఆన్‌లైన్​లో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటే, సైబర్‌ మాయగాళ్లకు (Cyber Crime) చిక్కే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అత్యధిక శాతం సైబర్‌ మోసాలు ఇక్కడే జరుగుతాయి. మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌లపై నిర్ధారణ కాని సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. ఇలాంటి అప్లికేషన్లను సాధారణంగా ఎస్‌ఎంఎస్‌, సోషల్‌ మీడియా, ఇన్‌స్టెంట్‌ మెసెంజర్‌ ద్వారా షేర్‌ చేస్తుంటారు. అందువల్ల వీటిని పూర్తిగా నమ్మలేం. సైబర్‌ నేరస్థులు యాప్స్‌ ముసుగులో మన సమాచారం తస్కరించే అవకాశం ఉంటుంది. ఒకసారి దాన్ని మనం డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ వాళ్ల అధీనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లతో...

స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా మాయగాళ్లు వల విసురుతారు. డౌన్‌లోడ్‌ చేసుకోగానే సిస్టమ్‌, మొబైల్‌ ఫోన్‌ వాళ్ల అజమాయిషీలోకి వెళ్లిపోతుంది. తద్వారా బ్యాంకు ఖాతా నుంచి సులువుగా సొమ్ము లాగేస్తారు. చాలా వరకు డిజిటల్‌ లావాదేవీల్లో సెల్‌ఫోన్‌ నంబరే కీలకం. అందువల్ల మోసగాళ్లు మన సెల్‌ఫోన్‌ సిమ్‌ కార్డును క్లోనింగ్‌ చేసేందుకు లేక డూప్లికేట్‌ సిమ్‌ కార్డు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు విజయం సాధిస్తే మనకు కోలుకోని నష్టం జరిగినట్టే. ఇలాంటి మోసగాళ్లు మనకు ఫోన్‌ చేసి, సిమ్‌ కార్డును అప్‌గ్రేడ్‌ చేయడానికి, లేదా మరొక అవసరం ఉందని చెబుతూ పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఫోన్‌ చేసి ఒక క్యూ ఆర్‌ కోడ్‌ పంపుతామని, స్కాన్‌ చేస్తే మీకు ఫలానా ప్రయోజనం లభిస్తుందని చెబుతారు. తొందరపడి దాన్ని స్కాన్‌ చేస్తే నష్టపోతాం.

నకిలీ ఖాతాలు సృష్టించి

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో మీకు తెలిసిన వారి పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తారు. మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడతారు. తర్వాత అత్యవసరం అంటూ ఆ ఖాతా నుంచి డబ్బు అడుగుతారు. స్నేహితుడే కదా అని మీరు పంపిస్తారు. ఒక్కోసారి ప్రైవేట్‌ ఛాట్‌చేసి దాని ఆధారంగా బ్లాక్‌ మెయిల్‌కూ పాల్పడతారు. మొబైల్‌ ఛార్జింగ్‌ పోర్టు కూడా ఫైల్స్‌, డేటా బదిలీకి ఉపయోగించే అవకాశం ఉంది. దీన్నే జ్యూస్‌ జాకింగ్‌ అంటారు. తెలియని ప్రదేశాల్లోని ఛార్జింగ్‌ పోర్టుల్లో మొబైల్‌ పెట్టినా, తెలియని యాప్‌లను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నా.. మీ ఆర్థిక సమాచారం, వ్యక్తిగత సమాచారం తస్కరించే ప్రమాదముంది. తర్వాత మనల్ని మోసం చేయడం చాలా సులువు. నకిలీ ఉద్యోగ పోర్టల్‌ సృష్టిస్తారు. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు అడుగుతారు. కొన్ని కేసుల్లో కంపెనీ అధికార్లుగా మోసగాళ్లు నకిలీ ఇంటర్వ్యూలూ చేస్తారు. శిక్షణ కోసం కొంత డబ్బు అడుగుతారు. ఇవన్నీ నమ్మామో అంతే.

ఏటీఎంలతో ఇలా..

ఏటీఎం కేంద్రాల నుంచి వినియోగదార్ల కార్డుల సమాచారం తస్కరించి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము కొట్టేస్తున్న వైనం చూస్తున్నాం. ఇటువంటి మోసగాళ్లు ఏటీఎం యంత్రాల్లో స్కిమ్మింగ్‌ డివైసెస్‌ అమర్చుతున్నారు. డమ్మీ కీప్యాడ్‌, చిన్న పిన్‌హోల్‌ కెమెరా పెట్టి, లావాదేవీ నిర్వహించేప్పుడు ఏటీఎంలో నొక్కే పిన్‌ నంబరు తెలుసుకుంటారు. ఒక్కోసారి ఏటీఎం పక్కనే సాధారణ వినియోగదారుల మాదిరిగా నిలబడి పిన్‌ నంబరును గమనిస్తారు. ఆ తర్వాత మనకు తెలీకుండా మన ఖాతా నుంచి సొమ్ము తస్కరిస్తారు. ఏటీఎం కేంద్రానికి వెళ్లినప్పుడు ఇటువంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

బ్యాంక్​ నుంచి అంటూ..

గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ లేదా సోషల్‌ మీడియా పోస్ట్‌ మనకు వస్తుంది. ఫలానా బ్యాంకు, బీమా కంపెనీ, ప్రభుత్వ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటారు. నమ్మకం కలిగించడం కోసం మన పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు చెబుతారు. బ్యాంకు ఖాతా, కార్డు వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉందంటూ, తమకు కావలసిన వివరాలు అడుగుతారు. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది, చూసి చెప్పండి అంటారు. అది చెప్పామా, బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకులు కానీ, ఇతర సంస్థలు కానీ మనకు ఫోన్‌ చేసి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, కార్డు వివరాలు, సీవీవీ నంబరు, ఓటీపీ అడగవని గుర్తించాలి. బ్యాంకు వినియోగదార్లలో చాలావరకు చదువుకున్నవారు ఉండొచ్చు. కానీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఖాతాదార్లలో ఎక్కువమందికి తగిన అవగాహన ఉండదు. కొందరు నిరక్షరాస్యులూ ఉంటారు. ఇటువంటి వారు మోసగాళ్ల గాలానికి సులువుగా చిక్కుతున్నారు.

రుణాలు ఇస్తామని..

వ్యక్తిగత రుణాలూ ఇస్తామంటూ మోసగాళ్లు నకిలీ వ్యాపార ప్రకటనలు ఇస్తారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లు, సులభ వాయిదాలు, ఎటువంటి హామీ అవసరం లేదంటూ ఊదరగొడతారు. తమను సంప్రదించమంటారు. ఎన్‌బీఎఫ్‌సీల్లోని సీనియర్‌ అధికార్లను పోలిన ఈ మెయిళ్ల ద్వారా వినియోగదార్లకు మరింత నమ్మకం పెంచుతారు. రుణాల కోసం వీరిని కలిసినపుడు అడ్వాన్స్‌ ఈఎంఐ అనో.. ప్రాసెసింగ్‌ ఫీజు అనో.. ఇలా ఏదో పేరుతో డబ్బులు గుంజుతారు. మళ్లీ కనిపించరు. ఎన్‌బీఎఫ్‌సీ రుణ పరిమితిని పెంచుతామనో.. లేదంటే మరో కొత్త రుణం ఇస్తామనో, మోసగాళ్లు మీ మొబైల్‌కు సమాచారం ఇస్తారు. మీరు కాల్‌ చేసిన వెంటనే కొన్ని ఫారాలు నింపాలంటారు. నమ్మకం కుదిరాక..రుణానికి సంబంధించి ఓటీపీ లేదా పిన్‌ వస్తుందని చెప్పి వాటిని తస్కరిస్తారు.

ఇలా ఎన్నో రూపాలుగా ఆర్థిక నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం తక్కువేమీ కాదు. పలు నివేదికలు, అధ్యయనాలు లెక్కలతో సహా వివరిస్తూ... తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వాలకు సూచనలు చేస్తూనే ఉన్నాయి.

ఇదీ చదవండి : జోకర్‌ రీఎంట్రీ.. ఈ యాప్స్‌ డిలీట్‌ చేయండి. లేదంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.