తెలంగాణ

telangana

అత్యాచారాన్ని అడ్డుకుందని మేనమామ ఘాతుకం.. నోట్లో యాసిడ్​ పోసి, గొంతుకోసి..

By

Published : Sep 6, 2022, 9:06 AM IST

Uncle acid attack on niece at nellore

Uncle acid attack on niece at Nellore : మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్​కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. అది శృతిమించి ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు.

Uncle acid attack on niece at Nellore : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో ఓ కామాంధుడు చెలరేగిపోయాడు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారయ్యాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

బాధిత బాలిక నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి.. ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన ఆమె పక్కనే ఉన్న వాష్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. సదరు వ్యక్తి తలుపులు బలంగా తోసుకుని లోనికి వెళ్లాడు. అక్కడ మరోమారు అత్యాచారానికి ప్రయత్నించటంతో తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ బాధ తట్టుకోలేక ఆమె పెద్దగా కేకలు వేయటంతో నిందితుడు కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.

చుట్టుపక్కల వారు వచ్చిచూడగా.. బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాధితురాలికి మేనమామ అవుతాడని నెల్లూరు ఎస్పీ విజయరావు వెల్లడించారు. తన మేనమామను కఠినంగా శిక్షించాలని బాలిక కోరినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బాధితురాలికి మంత్రి, ఎస్పీ పరామర్శ..:బాధితురాలిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎస్పీ సీహెచ్‌ విజయరావు, వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం రాత్రి పరామర్శించారు. ఘటనకు దారి తీసిన పరిణామాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఘటన జరిగిన ప్రాంతంలో కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details