తెలంగాణ

telangana

CYBER FRAUD: సైబర్ కేటుగాళ్ల మాయాజాలం.. ఓటీపీ చెప్పగానే లక్ష మాయం

By

Published : Jul 5, 2022, 5:54 PM IST

CYBER FRAUD: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పాత తరహాలో మోసాలకు పాల్పడటం కష్టంగా మారడంతో నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడుతున్నా వారి వివరాలు సేకరించి రివార్డ్ పాయింట్స్ పేరుతో వల విసిరి అందినకాడికి దోచుకుంటున్నారు.

సైబర్ నేరం
సైబర్ నేరం

CYBER FRAUD: సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. మూడు కమిషనరేట్ పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓటీపీ మోసాలకు పాల్పడుతున్న 11మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్​ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. నిందితులు క్రెడిట్ కార్డు వినియోగదారుల వివరాలు సేకరించి.. రివార్డ్ పాయింట్స్ గడువు ముగుస్తుందని వారికి వల విసురుతారు. పాయింట్స్ రీడిమ్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తారు. స్పందించిన వారికి ఓటీపీ పంపుతారు. ఆ తరువాత అందిన కాడికి కాజేస్తారని తెలిపారు.

గత నెల 11న కంచన్ బాగ్​కు చెందిన ఓ మహిళకు ఎస్బీఐ కార్డు డివిజన్ నుంచి కాల్ చేస్తున్నామని.. వెంటనే రివార్డ్ పాయింట్స్ వాడుకోవాలని లేకపోతే పాయింట్స్ వృథా అయిపోతాయని నమ్మించారు. దీంతో ఆమె వారు చెప్పిన విధంగా స్పందించింది. ఆ మహిళ ఫోన్​కి వచ్చిన ఓటీపీ చెప్పగానే ఆమె కార్డు నుంచి లక్ష రూపాయలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్​ పోలీసులు నోయిడాలోని కాల్ సెంటర్ కేంద్రంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వెంటనే ఆకేంద్రంపై దాడులు నిర్వహించి 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడిన వారిలో నలుగురు యువతులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 25 చరవాణులు, 6 సిమ్ కార్డులు, 10 ల్యాప్​టాప్​లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని గజరావు భూపాల్ తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details