తెలంగాణ

telangana

దంపతుల దారుణ హత్య, కర్రతో కొట్టి, కత్తితో గొంతు కోసి

By

Published : Aug 28, 2022, 3:44 PM IST

Couple Murder ఆంధ్రప్రదేశ్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దోపిడీ కోసం వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం జిల్లాలో సంచలనం సృషించింది.

couple murder in nellore
couple murder in nellore

Couple Murder: ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు అశోక్ నగర్​లో దారుణం జరిగింది. కరెంట్ ఆఫీస్ సెంటర్​లో క్యాంటీన్ నిర్వహించే దంపతులను కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. నెల్లూరులోని మినీ బైపాస్ సమీపంలోని అశోక్ నగర్‌లో శ్రీరామ్ క్యాంటీన్ పేరుతో హోటల్ నడుపుతున్న వసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీతను దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు దంపతుల ఇంటి వద్దనే గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుండగులు హత్యకు ఉపయోగించిన కత్తి, కర్ర స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఉన్న బీరువా నుంచి నగదు ఎత్తుకెళ్లారని, నగలు మాత్రం ఉన్నాయని మృతుల చిన్న కుమారుడు పోలీసులకు తెలిపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా లేక దోపిడీ దొంగలు ఈ పని చేశారా అనే కోణంలో ప్రధానంగా దృష్టి సారించినట్లు వేదాయపాలెం పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు(54), సునీత(50) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రేమ్‌చంద్, సాయిచంద్‌ ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాక వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్‌ శాఖలో ఉద్యోగి కాగా.. చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్‌ నడిపిస్తున్నారు. అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే ఉంటున్నారు. కృష్ణారావు స్థానికంగా కరెంట్‌ ఆఫీస్‌ సెంటరు వద్ద శ్రీరామ్‌ పేరుతో క్యాటరింగ్, హోటల్‌ నడిపిస్తున్నారు. వీరిది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. రోజూ కృష్ణారావు హోటల్‌ మూసేసి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుండేవారు. శనివారం రాత్రి కూడా భర్త వస్తారని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా పడక గదిలోకి వెళ్లి నిద్రపోయారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారని తెలుసుకుని లోనికి ప్రవేశించారు. పడక గదిలో నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో మోదారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

అనంతరం దుండగులు బంగారు ఆభరణాలు, నగల కోసం బీరువాలో అన్వేషించినా దొరకలేదు. రెండు లాకర్లలో ఒక లాకరుకు మాత్రమే తాళాలు వేసి ఉంది. తాళాలు లేని లాకరులో హోటల్‌కు సంబంధించిన రోజు వారీ కౌంటరు నగదు ఉండేది. తాళం ఉన్న లాకరులో బంగారం పెట్టేవారు. బంగారం ఉన్న లాకరు ఎంతకీ రాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో వరండా దగ్గరే దుండగులకు కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే తమతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి రాగానే దారుణాన్ని చూసి కృష్ణారావు బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుబహాన్, స్థానిక ఇన్‌స్పెక్టరు నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగింది? హత్య ఎలా చేశారనే వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు వాసిరెడ్డి సునీత తెదేపా సోషల్‌ మీడియా విభాగంలో పని చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details