తెలంగాణ

telangana

'నేను మీటింగ్‌లో ఉన్నా... వెంటనే డబ్బులు పంపు'

By

Published : Apr 23, 2022, 9:17 AM IST

Cheating With Collector DP: సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇదివరకు ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్‌ మార్చారు. వాట్సాప్‌ వేదికగా తమ మోసాలను కొనసాగిస్తున్నారు. కలెక్టర్ల ఫొటోలు పెట్టుకుని అధికారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Collector
Collector

Cheating With Collector DP: వాట్సాప్‌లో కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ డీపీ పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ పేరుతో మోసం చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో అదే తరహాలో వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. మొన్నటి వరకు ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు పంపించమని మోసాలకు పాల్పడేవారు. ఇటీవల వాట్సాప్‌ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పేరిట వాట్సాప్ వేదికగా డబ్బులు డిమాండ్ చేసిన ఘటన తెలిసిందే. అయితే కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేరుతో వాట్సాప్ వేదికగా జిల్లా అధికారులందరికీ సందేశాలు వచ్చాయి. నేను అత్యవసర సమావేశంలో ఉన్నాను మాట్లాడటానికి వీలు కాదని జిల్లాలోని అధికారులందరికీ 9725199485 నంబర్ నుంచి మెసెజ్‌లు వచ్చాయి. డిస్‌ప్లే పిక్చర్ సైతం కలెక్టర్ ఫొటో ఉండడంతో పలువురు అధికారులు నిజమేనని నమ్మి బదులు ఇచ్చారు.

ఛాటింగ్

ఫేక్ ఛాటింగ్: డీపీఓ రవి కృష్ణకు వచ్చిన సందేశంలో రవి కృష్ణ ఎక్కడ ఉన్నారు అని ప్రారంభించారు. నేను అత్యవసర సమావేశంలో ఉన్నాను. మీ దగ్గర అమెజాన్, ఈ పే గిఫ్ట్ కార్డులు ఉన్నాయా? లేకపోతే వెంటనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కార్డు తీసుకొని నాకు నంబర్ చెప్పండి అని ఆంగ్లంలో మెసేజ్ పంపించారు. గురువారం ఆదిలాబాద్‌లో కలెక్టర్ డీపీతో ఇదే విధంగా వచ్చిన సందేశాల నేపథ్యంలో కుమురం భీం జిల్లా అధికారులు మొదట సందేశాలకు బదులు ఇచ్చిన ఆ తర్వాత అనుమానం వచ్చి అప్రమత్తమయ్యారు. ఎవరు డబ్బులు పంపలేదు. బ్యాంకు, ఏటీఎం నంబర్‌లు సైతం చెప్పలేదు. మోసపూరిత సందేశాలను నమ్మవద్దని, ఎవరు స్పందించవద్దని జిల్లా అధికారులకు, ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details