తెలంగాణ

telangana

Telugu academy scam: కొనసాగుతోన్న సీసీఎస్ దర్యాప్తు.. బ్యాంకు అధికారులపై ప్రశ్నల వర్షం

By

Published : Oct 5, 2021, 5:09 AM IST

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో(Telugu academy scam) బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు మరోసారి ప్రశ్నించారు. అకాడమీ డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకుకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. డిపాజిట్ల గోల్​ మాల్​ కేసులో బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

Telugu academy scam
బ్యాంకు అధికారులపై ప్రశ్నల వర్షం

యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు అధికారులను సీసీఎస్ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు.. తెలుగు అకాడమీ డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకుకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. అకాడమీ అధికారులు రాసిన లేఖ చూపించడంతో.. డిపాజిట్లను ఇతర బ్యాంకుకు బదిలీ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అగ్రసేన్ బ్యాంకులో ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాల్లో నుంచి విడతల వారీగా కోట్ల రూపాయల డబ్బును విత్ డ్రా చేసుకొని ఎవరికి అప్పగించారనే విషయాన్ని సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమి రెడ్డి, అకౌంట్స్ అధికారి రమేశ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫిక్​ను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులనూ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై.. బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో ఒకేసారి వీళ్లందరినీ పోలీసులు ఆరా తీశారు. తెలుగు అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే.. ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.

రూ.63 కోట్ల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్ డ్రా చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్‌ మొహిద్దీన్ నగదును నిందితులకు అందజేశారు. నగదు తీసుకున్నది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్ కుమార్.. ఈ తతంగంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు కలిసి నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి తెరలేపినట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీకి అనుమతిస్తే.. నలుగురు నిందితులను ప్రశ్నించడం ద్వారా మరికొంత సమచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:Telugu academy fd scam: తెలుగు అకాడమీ నిధులను ఎవరు తీసుకున్నారు..?

ABOUT THE AUTHOR

...view details