తెలంగాణ

telangana

Floods Effect on Bhadradri : గోదావరి విలయానికి కారణమేంటి?

By

Published : Jul 23, 2022, 6:59 AM IST

Floods Effect at Bhadrachalam: గోదావరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటను వరద ముంచేసింది. గతంలో ఎన్నడూ రానంత నీటిమట్టం బూర్గంపాడు మండలం సారపాక కాలనీల్లో నమోదైంది. ఇళ్లకు ఇళ్లే కనిపించకుండా మునిగాయి. గోదావరి చరిత్రలో 1986లో అత్యధికంగా 75.6 అడుగుల స్థాయి మట్టం నమోదయింది. తాజా వరదల సమయంలో గరిష్ఠ మట్టం దానికన్నా 4.3 అడుగులు తక్కువే అయినప్పటికీ భారీ నష్టం చోటు చేసుకుంది. దీనికి కారణం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

Floods Effect on Bhadradri
Floods Effect

Floods Effect at Bhadrachalam: ఏటా గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నా.. ఇంతలా ఏనాడూ ఉరకలెత్తలేదంటున్నారు నీటిపారుదల రంగం నిపుణులు, స్థానికులు. మహా ప్రవాహంలా సాగిపోయేదే కానీ జనావాసాలను తుడిచిపెట్టుకుని పోలేదంటున్నారు. గతంలో పోల్చితే తాజా వరదలప్పుడు వాగులా దూకిందని చెబుతున్నారు. ఈ వేగమే గోదావరి ఒడ్డు బిడ్డలను నిలువునా ముంచడంతో పాటు భారీ ఇళ్లు, రోడ్లు, కరెంటు స్తంభాలు, తాటిచెట్లనూ పెకిలించివేసింది.

నాటి విలయాన్ని మించి ఉప్పెన..గోదావరి వరదల చరిత్రను పరిశీలించినా, ఈ ప్రాంత వాసులను కదిలించినా 1986లో వచ్చిన భారీ వరదలు విలయాన్ని సృష్టించాయని చెబుతుంటారు. నాడు భద్రాచలం వద్ద గరిష్ఠంగా 75.6 అడుగుల మట్టం నమోదవగా నదిలో 32.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఈ నెల 16న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గరిష్ఠంగా 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఇలా దాదాపు 17 గంటల పాటు 71 అడుగులపైనే మట్టం కొనసాగింది. అయితే నదిలో ప్రవాహం వేగంగా కనిపించిందని, ఇది గతంలో ఎప్పుడూ లేదని వరదలను చూస్తూ వచ్చిన వారు చెబుతున్నారు. ఈ కారణంగానే కిలోమీటర్ల కొద్దీ విస్తరించినప్పటికీ ఉప్పెనలా ముంచి కొట్టుకుపోవడానికి కారణమై ఉండొచ్చంటున్నారు.

ఏకధాటి వర్షాలే కారణం..సెకనులో చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కురిసిన వర్షం స్థాయిని బట్టి వరద ప్రవాహం ఆధారపడి ఉంటుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతారు. ఈ నెల 11న ప్రారంభమైన వరదలు దాదాపు 16వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో కుంభవృష్టిలా ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఒకటి, రెండు రోజులు కురిశాయి. దీనివల్ల కడెం నదితోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ వరదే క్రమంగా 16నాటికి భద్రాచలానికి చేరేసరికి విస్తరించింది. అప్పటికే నదిలో ప్రవాహం ఉండగా భారీ వరద వచ్చేసరికి వేగం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. గోదావరి పరీవాహకంలో నిజామాబాద్‌ జిల్లా నుంచి మొదలు భద్రాద్రి జిల్లా వరకు నదికి ఇరువైపులా మైదాన ప్రాంతాలు భారీగా విస్తరించాయి. నది ఒడ్డున చెట్లు, పొదలు పూర్తిగా కనుమరుగయ్యాయి. జనాభా పెరగడంతో ఆవాసాలు నదికి సమీపంలోకి వచ్చాయి. ప్రహరీలు, రహదారుల నిర్మాణంతో పరీవాహకంలో ఒక అడ్డుకట్టలా మారాయి. వరద వెనక్కు మళ్లేందుకు అవి కారణమయ్యాయి. దీనికితోడు భద్రాచలం పట్టణంలోకి వరద రాకుండా నిర్మించిన కరకట్ట కూడా ప్రవాహాన్ని రెండోవైపునకు మళ్లేలా ఒత్తిడి పెంచి ఉంటుందని, అది క్రమంగా వెనక ప్రాంతాల్లోనూ ముంపునకు కారణమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

గాలి వేగమూ ప్రవాహంపై ప్రభావం చూపుతుంది..గతం కన్నా ఈ సారి వచ్చిన వరదల సమయంలో గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఉద్ధృతి పెరిగి ఉండొచ్చు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలు నదిలో ఒకేసారి మట్టాన్ని, వేగాన్ని పెంచాయి. భద్రాచలం కరకట్ట నిర్మాణం, పోలవరం వద్ద కాఫర్‌ డ్యాం వల్ల కూడా వరదపై ఒత్తిడి పెరిగి ముంపునకు కారణమై ఉంటుంది. 1986లో నదిలో క్రమంగా మట్టం పెరిగింది. - కొండపల్లి వేణుగోపాల్‌రావు, విశ్రాంత సీఈ

ఏటా నది హద్దులపై సర్వే చేయాలి..గోదావరి తీరం వెంబడి నిర్మాణాలు పెరుగుతూ వస్తున్నాయి. నదికి ఒక మార్జిన్‌ ఉంటుంది. దాన్ని పరిరక్షించాలి. అడవులు, పొదలు అంతరించిపోవడమూ ప్రవాహ వేగం పెరగడానికి, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకురావడానికి కారణమవుతోంది. వర్షాకాలం, ఇతర కాలాల్లో నది ప్రవాహాన్ని అంచనా వేయాలి. ఇప్పటికైనా ఒక నిర్ధిష్టమైన గడువు పెట్టుకుని అక్కడి నుంచి ఆక్రమణలు పెరగకుండా చూస్తే భవిష్యత్తులో ముంపును అరికట్టవచ్చు. - భవానీ శంకర్‌, మాజీ పర్యవేక్షక ఇంజినీరు, హైడ్రాలజీ

30 ఏళ్ల క్రితం ఇంత వేగం చూడలే..1986లో నేను గోదావరి వరద చూశా. భారీ వరద వచ్చినా నది నెమ్మదిగానే పోయింది. మొన్న వచ్చిన వరద విలయంగా కనిపించింది. ఊర్లు, పొలాలు, గుట్టల సమీపంలోనూ భారీ వేగం కనిపించింది. దాని ప్రభావంతో ఇళ్లతో పాటు పెద్ద వృక్షాలు సైతం కొట్టుకుపోయాయి. ఇంత వేగం గతంలో ఎప్పుడూ చూడలేదు. - నారాయణ, చింతిర్యాల, అశ్వాపురం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details