తెలంగాణ

telangana

Minister Harish Rao : కేంద్రంలో కొట్లాట.. హుజూరాబాద్​లో మాత్రం కాంగ్రెస్​-భాజపాల దోస్తానా?

By

Published : Oct 18, 2021, 1:20 PM IST

ఈటల రాజేందర్‌తో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ఉద్ఘాటించారు. తెరాసనే గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని జూపాకలో పర్యటించి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ప్రచారం నిర్వహించారు.

Minister Harish Rao
Minister Harish Rao

జుపాకలో మంత్రి హరీశ్ రావు ప్రచారం

హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస, భాజపాలు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటూ జోరు పెంచుతున్నాయి. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి వివరిస్తూ.. తెరాస దూసుకెళ్తుంటే.. తెరాస సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. భాజపా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతను తన భుజానికెత్తుకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao).. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని జూపాకలో పర్యటించి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ప్రచారం నిర్వహించారు. గులాబీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​కు మద్దతిస్తూ.. కారు గుర్తుకే ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరిస్తూ.. అవి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజీనామాకు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు చెప్పారు. ఈటల తన సొంత లాభం కోసం, స్వార్థం కోసమే రాజీనామా చేశారని అన్నారు.

"గెల్లు శీనన్నకు కేసీఆర్ ఆశీర్వాదం ఉంది. నేను కూడా మాటిస్తున్నా. శీనుకు తోడుగా.. నేనుంటా. ప్రతి 15 రోజులకు ఒకసారి నేను హుజూరాబాద్​ నియోజకవర్గానికి వస్తా. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్ని అమలయ్యేలా చేస్తా. గ్యాస్ ధరలు పెంచి మధ్యతరగతి, పేద ప్రజలకు అదనపు భారాన్ని కలిగిస్తున్న భాజపాకు మీరే బుద్ధి చెప్పాలె."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఈ ఉపఎన్నికలో ఈటల గెలవరని, గెలిచినా మంత్రి అవ్వరని.. ఆయనతో పనులు కావని హరీశ్(Minister Harish Rao) అన్నారు. ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలు బాగా ఆలోచించాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్, భాజపాలు కొట్లాడుతన్నాయన్న మంత్రి.. హుజూరాబాద్​లో మాత్రం ఒక్కటయ్యాయని చెప్పారు. ఈటల గెలిస్తే భాజపాకు లాభమని.. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే జూపాక గ్రామానికి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details