తెలంగాణ

telangana

Etela rajender Profile : ఏడుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు మంత్రి.. ఈటల విజయ ప్రస్థానమిదే...

By

Published : Nov 2, 2021, 7:00 PM IST

Updated : Nov 2, 2021, 7:53 PM IST

సౌమ్యుడిగా ముద్రపడ్డ ఈటల రాజేందర్(Etela rajender Profile) ఉద్యమనాయకుడిగా కేసీఆర్ కుడిభుజంగా కొనసాగారు. వ్యక్తిత్వంలో ఎప్పుడు మంచి మార్కులే కొట్టేసిన ఈటల ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. సంక్షేమ గృహంలో చదివి.. వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి.. ఉద్యమ సమయంలో తెరాస పార్టీ సైనికుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. తెరాస శాసనసభాపక్షనేతగా.. అందరి అభిమానాన్ని చూరగొన్నారు. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల.. కేసీఆర్ కేబినెట్​లో ఆర్థిక మంత్రిగా.. బడ్జెట్​ లెక్కల్లో తన మేధస్సును రంగరించారు. మరోసారి వైద్యశాఖ మంత్రిగా కరోనా కాలంలో ప్రజల వెన్నంటి ఉన్నారు. తెరాస అధిష్ఠానంతో పొసగక.. మంత్రిగా బర్తరఫ్ చేస్తే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ పార్టీలో ఇమడలేక కమలతీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలో దిగారు. ఉద్యమనేతగా.. రెండుసార్లు మంత్రిగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఈటల.. ఏడోసారీ విజయబావుగా ఎగురవేశారు.

etela-rajender-political-career-from-telangana-movement-leader-to-telangana-minister
etela-rajender-political-career-from-telangana-movement-leader-to-telangana-minister

ఉద్యమనాయకుడు కేసీఆర్‌ కుడి భుజంగా కొనసాగిన ఈటల రాజేందర్‌(Etela rajender Profile) ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. సంక్షేమ వసతి గృహంలో చదివిన ఈటల.. వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పని చేశారు. ఉద్యమ సమయంలో పార్టీ సైనికుడిగా, తెరాస శాసనసభాపక్ష నేతగా ప్రజల్లో గుర్తింపు పొందారు.

ఉద్యమానికి ఆకర్షితుడై..

ఉద్యమ సమయంలో వ్యాపారవేత్తగా ఉన్న ఈటల రాజేందర్‌(Etela rajender Profile) స్వరాష్ట్ర ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. క్షేత్రస్థాయిలో తెరాస పార్టీ విస్తరణ కార్యక్రమాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. సమైఖ్య పాలకులు విద్యార్థి ఉద్యమ నాయకులను అరెస్టు చేసిన ప్రతిసారి వారిని విడిపిచేందుకు ఉద్యమ నాయకుడిగా ముందున్నారు. ఉద్యమ సమయంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కమలాపూర్‌ కార్యకర్తలు ఈటల నాయకత్వంలో పార్టీని ముందుండి నడిపారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన హుజూరాబాద్‌ నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత పార్టీ శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో గళం వినిపించారు.

పైసల మంత్రిగా తనదైన ముద్ర

తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర బడ్జెట్ లెక్కల్లో తన మేధస్సును రంగరించారు.​ అనేక పోరాటాల తర్వాత ఏర్పడిన రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కకునేందుకు తన వంతు పాత్ర పోషించారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన అప్పటి ప్రభుత్వంలో ప్రాజెక్టులకు నిధుల మంజూరు, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయటంలో పైసల మంత్రిగా చక్కగా పనిచేశారు. ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను హుజూరాబాద్‌లో కచ్చితంగా అమలు చేశారు.

మహమ్మారి సమయంలో మనోధైర్యం నింపి..

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి వచ్చిన సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌(Etela rajender Profile) సేవలందించారు. రోగులకు అందే సేవలపై నిరంతరం పర్యవేక్షించేవారు. మహమ్మారి ఉద్ధతంగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్లో పర్యటన చేసి రోగుల్లో, అధికారుల్లో మనోధైర్యం నింపారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెంపొదించటంలో ఈటల కీలక పాత్ర పోషించారు.

పొగపెట్టినా.. తెగబడి నిలబడ్డారు..

రెండోసారి మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెరాసలో ఈటల(Etela rajender Profile)పై ప్రతికూల భావం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలపై సునిషిత విమర్శలు, రైతు బంధు పథకం సహా మేకల పంపకం వంటి పలు పథకాలపై అసంతృప్తి వెలిబుచ్చడం ఈటలకు నెగిటివ్​గా మారింది. అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. ఇలాగే ఉంటే ఈటల మేకుగా మారతాడని భావించి.. తోక కత్తిరించాలని భావించిన హైకమాండ్.. భూకబ్జాలను తెరపైకి తీసుకువచ్చింది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేసింది. అది అవమానంగా భావించిన ఈటల.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీ నుంచి వైదొలిగి కమలతీర్థం పుచ్చుకున్నారు.

ఆత్మాభిమానం కంటే ఏదీ ఎక్కువ కాదనే నినాదంతో.. ఉద్యమనేతగా తాను చేసిన పోరాటాన్ని వివరిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి గురించి చెబుతూ.. తెరాస వైఫల్యాలు ఎండగడుతూ.. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మంత్రుల విమర్శలు తిప్పికొడుతూ.. అన్ని అడ్డంకులను ఎదురించి హుజూరాబాద్ గద్దెపై కాషాయ జెండా ఎగురవేశారు. ఆత్మాభిమానం ముందు అధికార పార్టీ తలొగ్గేలా చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఏడోసారి ఘనవిజయం సాధించారు.

Last Updated :Nov 2, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details