తెలంగాణ

telangana

ప్రగతి చక్రం.. కరోనాతో ఛిద్రం.. తగ్గిన ఆదాయం

By

Published : Jul 13, 2020, 7:13 AM IST

ఆర్టీసీపై కరోనా తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆదాయం పడిపోయింది. లాక్‌డౌన్‌ ఆరంభం నుంచి ఆర్టీసీ ఆర్థికంగా కుదేలవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. కరోనా భయంతో ప్రజలు ప్రయాణం చేసేందుకు వెనకాడుతున్నారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ అనూహ్యంగా పడిపోయింది.

tsrtc
tsrtc

కరోనాతో ఆర్టీసీ మునుగుతోంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతోంది. ఆదాయం గణనీయంగా పడిపోతోంది. హైదరాబాద్‌ సిటీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. లాక్‌డౌన్‌ ఆరంభం నుంచి ఆర్టీసీ ఆర్థికంగా కుదేలవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. కరోనా భయంతో ప్రజలు ప్రయాణం చేసేందుకు వెనకాడుతున్నారు.

రూ.2.5 కోట్లు మించట్లైదు

సాధారణంగా ఆర్టీసీకి రోజూ రూ.13 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కరోనా నిబంధనలు సడలించిన తర్వాత 20 రోజులపాటు రోజుకు రూ.3.5 కోట్ల వరకు వచ్చింది. ఆ తరవాత నుంచి ఆదాయం నేల చూపులు చూస్తోంది. గడిచిన పదిహేను రోజులుగా రోజు వారీ ఆదాయం రూ.రెండున్నర కోట్లను మించటం లేదు. ఆదాయం లేని మార్గాల్లో ఇప్పటికే సుమారు వెయ్యి బస్సులను రద్దుచేశారు.750 వరకు అద్దె బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు యజమానులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులు లేని మార్గాల్లో బస్సులను నిలిపివేయాల్సిందిగా అధికారులకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఈనాడు’తో చెప్పారు.

భారీగా పడిపోయిన ఆక్యుపెన్సీ

బస్సుల్లో ఆక్యుపెన్సీ అనూహ్యంగా పడిపోయింది. ఇంత తక్కువ ఆక్యుపెన్సీ ఆర్టీసీ చరిత్రలోనే ఎప్పుడూ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 3,500 బస్సులను నడుపుతుండగా.. సింహభాగం మార్గాల్లో ఆక్యుపెన్సీ 30 శాతానికన్నా తక్కువగా ఉంటోంది. ఈ ప్రభావం ఆదాయంపై తీవ్రంగా పడింది. ఇటీవల కాలంలో అత్యధికంగా వచ్చిన ఒక రోజు ఆదాయం రూ.2.60 కోట్లు.

చర్చల దశలోనే ఒప్పందం

అంతర్‌రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో బస్సులు నడిపినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఒక వారం రోజుల తరవాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అధికారులంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో జరగాల్సిన అంతర్‌ రాష్ట్ర ఒప్పందం కూడా చర్చల దశలోనే నిలిచిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కూడా కేసులు పెరుగుతుండటంతో సిటీ సర్వీసులు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందని మంత్రి అజయ్‌కుమార్‌ చెప్పారు.

ఇదీ చదవండి:హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ABOUT THE AUTHOR

...view details