తెలంగాణ

telangana

'సీఎం కేసీఆర్‌ను కేంద్రం వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి..'

By

Published : Jul 17, 2022, 7:42 PM IST

Revanth Reddy Comments: హైదరాబాద్​ లక్డీకపూల్​లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్​ నేతలు సమావేశమయ్యారు. మూడున్నర గంటలపాటు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన నేతలు.. సీఎం కేసీఆర్​ క్లౌడ్​ బరస్ట్​ అంశంపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్​ను కేంద్రం వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.

TPCC Chief Revanth Reddy demanded Center should take CM KCR into custody immediately
TPCC Chief Revanth Reddy demanded Center should take CM KCR into custody immediately

Revanth Reddy Comments: విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని స్వయాన సీఎం కేసీఆర్‌ చెప్పడంపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎం హోదాలో మాట్లాడిన మాటలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కేసీఆర్​ నుంచి కుట్ర సమచారాన్ని రాబట్టాలన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే కేంద్ర భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాల్సిన భాధ్యత కేసీఆర్‌కు ఉందని గుర్తుచేసిన రేవంత్‌.. అలా చేయని పక్షంలో కేంద్రమే కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని రేవంత్​ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు.

హైదరాబాద్​ లక్డీకపూల్​లోని ఓ హోటల్‌లో మూడున్నర గంటలపాటు జరిగిన నేతల సమావేశంలో అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల 11లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల్లో ఓ జర్నలిస్ట్ చనిపోవడం బాధాకరమని.. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ తరపున జర్నలిస్ట్​ కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించారు.

"జాతీయ రాజకీయాల మీద పడి కేసీఆర్ జాతీయ విపత్తును గాలికొదిలేశారు. వరదల్లో మునిగిపోతున్న ప్రజలను, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. తప్పనిసరి పరిస్థతుల్లోనే కేసిఆర్ ప్రగతిభవన్‌ గడప దాటారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో లోపం జరిగింది. క్లౌడ్ బరస్ట్ పేరిట కాళేశ్వరం లోపాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. క్లౌడ్‌ బరస్ట్‌పై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సమాచారమివ్వాలి. లేకపోతే.. కేంద్రమే కేసీఆర్‌ను కస్టడీలోకి తీసుకుని.. క్లౌడ్‌ బరస్ట్‌పై విచారణ జరిపించాలి." - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

"రాష్ట్రంలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి.. నీరు, ఆహారం సరిగా అందించడం లేదు. పంట నష్టంపై ఇంత వరకు అంచనా కమిటీ వేయలేదు. తక్షణమే అధికార బృందాన్ని క్షేత్రస్థాయికి పంపి నష్టాన్ని అంచనా వేయాలి. ఇల్లు కోల్పోయిన వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇవ్వాలి. బాధితులకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద 25 వేలు ఇవ్వాలి." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

సీఎం కేసీఆర్‌ను కేంద్రం వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details