తెలంగాణ

telangana

Lepakshi Temple : లేపాక్షికీ యునెస్కో గుర్తింపు?

By

Published : Jul 27, 2021, 6:36 AM IST

ప్రపంచ వారసత్వ కట్టడంగా ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ప్రఖ్యాత లేపాక్షి(Lepakshi Temple) ఆలయానికీ యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

లేపాక్షికీ యునెస్కో గుర్తింపు
లేపాక్షికీ యునెస్కో గుర్తింపు

ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయాని(Lepakshi Temple)కీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ కమిటీ 2020 జనవరిలో విశాఖపట్నం సందర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కట్టడాలేవీ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో లేని విషయాన్ని గుర్తించి దీనిపై అధికారులను ఆరాతీసింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు లేపాక్షి క్షేత్రం అప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినట్లు స్థాయీ సంఘానికి చెప్పారు. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి అది తొలి అడుగు అని వివరించారు.

అలాగే.. రాతియుగానికి చెందిన కేతవరం గుహలను కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చమని కోరుతూ యునెస్కోను సంప్రదించబోతున్నట్లు తెలిపారు. దీనిపై స్థాయీసంఘం సంతృప్తి వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి అర్హత ఉన్న కేంద్రాలు, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన సాయం చేయాలని సిఫార్సు చేసింది. తెలంగాణలోని నాగార్జునకొండకు పడవ ప్రయాణాలు నిర్వహించుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతివ్వాలని సూచించింది.

ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రంలో రూ.159 కోట్ల వ్యయంతో 13 చోట్ల ప్రపంచస్థాయి మ్యూజియంలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. విగ్రహాలు, స్మారకాల ధ్వంసం చేసే ఘటనలను అడ్డుకోవడానికి కఠినమైన చట్టాల అవసరం ఉందని, ఇలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని కోరినట్లు పేర్కొంది. స్మారకాల చుట్టూ ప్రహరీ నిర్మించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌ ఏర్పాటుచేయాలని ఏపీ ప్రతినిధులు విజ్ఞప్తిచేసినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details