తెలంగాణ

telangana

high court on Ganesh immersion: 'ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న కుంటల్లో నిమజ్జనం చేయండి'

By

Published : Sep 13, 2021, 3:01 PM IST

Updated : Sep 14, 2021, 4:18 AM IST

Ganesh immersion: గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ
Ganesh immersion: గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ

15:00 September 13

high court on Ganesh immersion: 'ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న కుంటల్లో నిమజ్జనం చేయండి'

 హుస్సేన్ సాగర్​లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈనెల 9న ఇచ్చిన తీర్పును సవరించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తీర్పును పునఃసమీక్షించి కొన్ని అంశాలను సవరించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. హుస్సేన్ సాగర్​లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి కూడా అనుమతివ్వాలని.. రబ్బరు డ్యాం నిర్మాణానికి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు.  

తీర్పు ఇచ్చాకే గుర్తించారా

ప్రత్యేక నీటి కొలనుల్లో ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు నిమజ్జనం చేయడం కష్టమని.. వాటికి రోడ్డు మార్గాలు కూడా సరిగా లేవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అభ్యర్థన ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటి వరకు మూడు నివేదికలు సమర్పించాలని.. వాటిలో ఎందుకు ఈ విషయాలు చెప్పలేదని ప్రశ్నించింది. కుంటల్లో ఎక్కువ ఎత్తువిగ్రహాలు నిమజ్జనం చేయడం కష్టమనే విషయం.. తీర్పు ఇచ్చాకే గుర్తించారా అని పేర్కొంది. నీటి కుంటలు అద్భుతమైన ప్రత్యామ్నాయ పరిష్కారం అన్నట్లుగా అప్పుడు వివరించి.. ఇప్పుడు పనికి రావని ఎలా అంటున్నారని ప్రశ్నించింది.  

నిజాయతీ కనిపించడం లేదు

ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో నిజాయతీ కనిపించడం లేదని.. అసలు వాస్తవాలు చెప్పడం లేదని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఎన్​జీటీ, కేంద్ర పీసీబీ కొన్నేళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చాయని.. ఇన్నాళ్లుగా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. కొవిడ్ ప్రభావం వల్ల కొంతకాలంగా ప్రభుత్వం పూర్తిగా వైద్యంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వివరించారు. కొవిడ్ సమయంలోనే మల్లన్నసాగర్​లోకి నీటిని వదిలారు కదా.. అన్నీ చేయడానికి ఉన్న సమయం దీనికి ఎందుకు లేదని ప్రశ్నించింది. ఇప్పటికే విగ్రహాలు మండపాల్లో ఉన్నాయని.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీర్పును సవరించాలని కోరారు. ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం తనకు తాను సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.  

అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు

సమస్యలను ముందుగానే గుర్తించి.. పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని ధర్మాసనం పేర్కొంది. జలాశయాలను కలుషితం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమంటున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. వాటిని ఉల్లంఘిస్తారా లేదా అమలు చేస్తారా ప్రభుత్వమే ఆలోచించుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోరారు. వినాయక విగ్రహాలు, పూజలను నిషేధించలేదని... పీఓపీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేయవద్దంటున్నామని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ రివ్యూ పిటిషన్ కొట్టివేసింది. తీర్పుపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

సంబంధిత కథనం :'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

Last Updated :Sep 14, 2021, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details