తెలంగాణ

telangana

ఉగ్ర కృష్ణమ్మ : 11 ఏళ్ల తర్వాత శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీ వరద

By

Published : Oct 18, 2020, 6:51 AM IST

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. శ్రీశైలంలోకి 7 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవాహం వచ్చింది. అక్టోబరులో ఇంత భారీ వరద రావడం అరుదే. 2009 అక్టోబరులో శ్రీశైలం చరిత్రలోనే అత్యధికంగా 17.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి ఉండొచ్చని అప్పట్లో నీటిపారుదల శాఖ అంచనావేసింది.

Srisailam Reservoir floods again after 11 years
11 ఏళ్ల తర్వాత శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీ వరద

2009 తర్వాత మళ్లీ అక్టోబరులో భారీ వరద రావడం ఇదే. గత ఏడాది అక్టోబరు 25న 6.52 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరుసగా నాలుగురోజుల పాటు భారీ వరద ప్రవాహం కొనసాగింది. ఇప్పుడూ గత కొన్ని రోజులుగా భారీ వరద ఉండగా, శనివారం ఉదయం ఆరుగంటలకు నీటిపారుదల శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం 7.02 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు మించి అనేకసార్లు వచ్చింది. విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడమే కాకుండా గేట్లు ఎత్తి ఎక్కువరోజులు నీటిని విడుదల చేశారు.

ఆగస్టు రెండోవారం నుంచి ఇప్పటివరకు 50 రోజులకు పైగా స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రధాన నది కృష్ణాతో పాటు బీమా, తుంగభద్ర ఇలా అన్ని నదుల నుంచీ భారీ ప్రవాహం కొనసాగుతోంది. వారం రోజులుగా అన్ని రిజర్వాయర్లలోకి అత్యధిక ప్రవాహం ఉండగా, ఎందులోనూ నిల్వ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌ కూడా నీటమునిగింది. నాగార్జునసాగర్‌, పులిచింతల కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. సాగర్‌ నుంచి 5.39 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి 6.82 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఇప్పటివరకు 910 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. గోదావరిలో ఇప్పటివరకు 3500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది.

గేట్లు ఎత్తి.. దించి.. మళ్లీ దించి!

శ్రీశైలం జలాశయంలో శుక్రవారం పలుమార్లు గేట్లు పైకెత్తి, మళ్లీ కిందకు దించి, తర్వాత ఇంకా కిందికి దించడం.. ఇలా కొన్ని గంటల తేడాలోనే చేశారని విశ్రాంత ఇంజినీర్లు ప్రస్తావిస్తున్నారు. వరద మాన్యువల్‌ను అనుసరించడం కన్నా 885 అడుగుల గరిష్ఠ నీటిమట్టం ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు 10 గేట్లు 33 అడుగుల మేర ఎత్తి 6,91,780 క్యూసెక్కులు వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ 25 అడుగుల ఎత్తుకు తగ్గించి 5,54,440 క్యూసెక్కులు వదిలారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు 20 అడుగులకు తగ్గించి కేవలం 4,67,000 క్యూసెక్కులు వదిలారు. ఎక్కడి నుంచి ఎంత వరద వస్తుందో తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విమర్శలు రావడంతో శనివారం శ్రీశైలంలో స్థిరంగా గేట్ల నిర్వహణ కొనసాగుతోంది. స్థిరంగా 5,67,160 క్యూసెక్కులు వదులుతున్నారు.

ప్రమాదస్థాయిని దాటి..

కన్నడనాట వానపోటు తగ్గినా.. మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఒకవైపు బీమా, మరోవైపు కృష్ణా నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆలమట్టి జలాశయం నుంచి 1,79,166 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపుర జలాశయం ఇప్పటికే నిండటంతో 2,01,487 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తుంగభద్ర నదికీ వరద రావడంతో 40,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

బీమాలో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం ప్రభావం కొంత బీమా పరీవాహక ప్రాంతానికి చేరిందని చెబుతున్నారు. తెలంగాణ మీదుగా బీమా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా బీమా బేసిన్లో భారీ వర్షాల వల్ల ఆ ఉపనది పొంగి ప్రవహిస్తోంది. కేంద్ర జలసంఘం శనివారం మధ్యాహ్నం రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 4,94,634 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణానదిపై చిట్టచివర ఉన్న ప్రకాశం బ్యారేజికి శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా 9 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు.

శ్రీశైలం జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 884.40 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 211.95772 టీఎంసీలుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details