తెలంగాణ

telangana

తెరాస, కాంగ్రెస్​ పొత్తుపై మాణిక్కం క్లారిటీ...

By

Published : Apr 17, 2022, 6:42 PM IST

Manickam Tagore : తెలంగాణలో తెరాసతో కాంగ్రెస్‌ పార్టీకి పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని... పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభలో తమ పార్టీ బలం ఏంటో చూపిస్తామని వెల్లడించారు.

manickam tagore
manickam tagore

Manickam Tagore : తెలంగాణలో తెరాసతో కాంగ్రెస్‌ పార్టీకి పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ స్పష్టం చేశారు. అదంతా అవాస్తవమని... పూర్తిగా నిరాధారమని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భాజపా, తెరాసలపై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటంలో ఒక్క ఇంచు కూడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తెరాస వాళ్లే చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభలో తమ పార్టీ బలం ఏంటో చూపిస్తామని వెల్లడించారు.

శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో, డీసీసీలతో వివిధ అంశాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు మాణిక్కం ఠాగూర్‌లు చర్చించారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది కాంగ్రెస్ స‌భ్యుల‌కు ప్రమాద బీమా కల్పించిన విషయమై ఈ సమావేశాలల్లో చర్చించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు రాహుల్‌ గాంధీ పర్యటన అధికారికంగా ఖరారు అయ్యింది. తెలంగాణ‌ రాష్ట్రంలో వ్యవ‌సాయం, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన స‌మ‌స్యలు, ఆత్మహత్యలు తదితరాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.

మే 6వ తేదీన వ‌రంగ‌ల్‌ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో రైతు సంఘ‌ర్షణ స‌భ నిర్వహించాలని, 7వ తేదీన హైద‌రాబాద్‌లో వివిధ వ‌ర్గాల‌తో రాహుల్ గాంధీ భేటీ కానున్న అంశాల‌పై చ‌ర్చించారు. ఆ బహిరంగ సభకు కనీసం 5 ల‌క్షల మందిని రప్పించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నాయకులకు స్పష్టం చేశారు. ఎండవేడిమి అధికంగా ఉండడంతో... సాయంత్రం 6 గంట‌ల‌కు స‌భ నిర్వహించాలని, సాయంత్రం 4గంటల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు వ‌రంగ‌ల్ న‌గ‌రంలో భారీ ప్రద‌ర్శన నిర్వహించాల‌ని పార్టీ నిర్ణయించింది. 40 ల‌క్షల పార్టీ డిజిట‌ల్ సభ్యత్వం చేసినందున వారందరికి ప్రమాద బీమా సౌక‌ర్యం కూడా క‌ల్పించింది.

ఇటీవల కాలంలో వడ్ల కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి... పండిన పంటను కొనుగోలు చేసేట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అధికార తెరాస, భాజపా వైఫల్యాలను ఎండగట్టే విషయమై పార్టీ శ్రేణులు, నాయకులు అవిశ్రాంతంగా పోరాటం చేయాల్సిందేనని పీసీసీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసి... ఓటర్లను ఆకర్శించేందుకు అవసరమైన దిశలో ముందుకు వెళ్లనుంది.

ఇదీ చదవండి :రెడ్ మిర్చి ఘాటులా రకుల్.. ఆ డ్రెస్​ రూ.55 వేలంట!

ABOUT THE AUTHOR

...view details