తెలంగాణ

telangana

అరుదైన కట్టడాలు.. కాపాడుకుంటేనే పది కాలాలు...

By

Published : Jan 21, 2021, 8:15 AM IST

renovation of Heritage monuments in Hyderabad
అరుదైన కట్టడాలు.. కాపాడుకుంటేనే పది కాలాలు

రాజ మహళ్ల నగరం హైదరాబాద్‌.. ఇక్కడ ఏ మూలకు వెళ్లినా ఓ అద్భుతమైన చారిత్రక రాజమందిరం తారసపడుతుంది. వందల ఏళ్ల చరిత్రను ఈ నిర్మాణాలు భావితరాలకు చెబుతూ ఉంటాయి. అత్యంత ఖరీధైనవి, చారిత్రక విశేషాలతో అలరించేవి, ఇంజినీరింగ్‌ ప్రతిభతో అబ్బురపరిచే నిర్మాణశైలితో ఆ కాలపు విశిష్టతలను తెలుపుతూ ఉంటాయి.

భాగ్యనగరంలోని చారిత్రక నిర్మాణాల్లో అరుదైనవిగా చెప్పుకునేవి.. మాల్వాల ప్యాలెస్‌, రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌. ప్రస్తుతం వీటిలో మాల్వాల ప్యాలెస్‌ కనుమరుగైపోగా రాజా భగవన్‌దాస్‌ ప్యాలెస్‌ను కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఇటీవల ఈ ప్యాలెస్‌ను సందర్శించినట్లు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పునరుద్ధరణ చేయాల్సిన సమయం వచ్చిందంటూ తెలిపారు.

అరుదైన ప్యాలెస్‌..

సుమారు 200 ఏళ్ల క్రితం నాటి నివాస గృహం ‘మాల్వాల ప్యాలెస్‌’. చార్మినార్‌ ప్రాంతంలో చందూలాల్‌ అనే వ్యాపారికి చెందినది ఈ ప్యాలెస్‌. సంబంధిత హక్కుదారులు ఈ ప్యాలెస్‌ను కూల్చేయడంతో అరుదైన కట్టడం కనుమరుగైపోయింది. ఈ తరహా ప్యాలెస్‌ రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌.. ఇది గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌కి సమీపంలోని తాళ్లగడ్డ, కార్వాన్‌ ప్రాంతంలో దర్శనమిస్తుంది. దీన్ని బర్మా టేకుతో నిర్మించారు. కేవలం చెక్కతోనే కట్టిన వందల ఏళ్లనాటి అపరూపమైన కట్టడాలు నగరంలో కేవలం రెండే ఉండేవి. అందులో ఒకటి మాల్వాలా ప్యాలెస్‌ రెండోది ప్రస్తుత భగవన్‌ దాస్‌ ప్యాలెస్‌.

కుతుబ్‌షాహీల సమయంలో నిర్మాణం

17వ శతాబ్దంలో ఈ ప్యాలెస్‌ను భగవన్‌దాస్‌ కొనుగోలు చేశారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్యాలెస్‌ నిర్మాణం జరిగింది. మైసూరు వద్ద శ్రీరంగపట్నంలో ఉన్న దరియా దౌలత్‌బాద్‌ నిర్మాణ శైలిలో ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. చెక్క భవంతిలో ఇండో పర్షియన్‌, మొగల్‌ శైలిలో నిర్మాణం జరిగింది. శతాబ్దాల పురాతనమైన కడీవర్క్‌, చెక్కమీద అందంగా చెక్కిన నగిషీలు, కిటికీలు చూపరులను ఆకట్టుకుంటాయి. లైమ్‌స్టోన్‌, చింత గింజలు, ఆకులు, కాయలతో చేసిన సహజ రంగులను వినియోగించడంతో ఆ రంగులు చెక్కుచెదరలేదు. నాలుగు మెట్ల బావులు ఉండేవి. అయితే ఇందులో కేవలం ఒక్క బావి మాత్రమే కనిపిస్తోంది. భగవాన్‌దాస్‌ పూర్వీకులు గుజరాత్‌కు చెందిన గుజరాతీ బనియాలు. వీళ్లు మొఘలుల వద్ద సివిల్‌ కాంట్రాక్ట్‌లు, ఫారెస్ట్‌ కాంట్రాక్ట్‌లు చేసేవారు. ఔరంగజేబు వద్ద పనిచేసే కమ్రూద్దీన్‌కు వీరికి మంచి సంబంధాలుండేవి. ఔరంగజేబు తర్వాత బీజాపూర్‌ గవర్నర్‌గా ఉన్న కమ్రూద్దీన్‌ స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని గోల్కొండకు వచ్చిన సమయంలో వీరు ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలోనే నిజాం కాలంలో వజ్రాల వ్యాపారంలో పేరు తెచ్చుకున్నారు. అప్పుడే షావుకారీ కార్వాన్‌లో వీరి కుటుంబం స్థిరపడింది.

పునరుద్ధరణ జరిగేనా?

ప్రైవేటు వ్యక్తుల చేతులో ఉన్న చారిత్రక కట్టడాలను పరిరక్షణకు, పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రి పేర్కొన్నారని ఇప్పటివరకు ఎక్కడా పునరుద్ధరణ చేపట్టలేదని వారసత్వ కట్టడాల ప్రేమికులు ఆరోపిస్తున్నారు.

సందర్శించి వెళ్లారు

రెనోవేషన్‌ చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. ప్రభుత్వ సాయం కోసం గతంలో అర్జీ పెట్టుకున్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్యాలెస్‌ను సందర్శించి వెళ్లారు. పునరుద్ధరణపై ఎక్కడా చర్చించలేదు.

ABOUT THE AUTHOR

...view details