తెలంగాణ

telangana

Rajiv Gruhakalpa Scheme : కల నెరవేర్చకుండా.. కట్టిన సొమ్ము వాపసు

By

Published : Jan 29, 2022, 11:29 AM IST

Rajiv Gruhakalpa Scheme :పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరుస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో వేలాది మంది రాజీవ్‌ స్వగృహ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఆశావహులకు నిరాశను మిగిల్చే ప్రకటనను కార్పొరేషన్‌ విడుదల చేసింది. దాదాపు 73కోట్లకుపైగా ప్రజల నుంచి స్వీకరించిన సొమ్మును దరఖాస్తు చేసుకున్నవారికి వాపసు ఇస్తామనడంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Rajiv Gruhakalpa Scheme
Rajiv Gruhakalpa Scheme

కల నెరవేర్చకుండా.. కట్టిన సొమ్ము వాపసు

Rajiv Gruhakalpa Scheme : రాజీవ్‌ స్వగృహ పథకం కింద సొంతిల్లు వస్తుందనుకొంటే నిరాశే మిగిలిందన్న అసంతృప్తి దరఖాస్తుదారుల్లో వ్యక్తం అవుతోంది. సొంతింటి కల నెరవేరుస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో 2007 సంవత్సరంలో.. తెలంగాణవ్యాప్తంగా 73వేలకుపైగా ఆశావహులు డబ్బు చెల్లించారు. ఆనాటి నుంచి సొంత ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. పేదప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రాజీవ్‌ స్వగృహ పథకం కింద సొమ్మును ప్రభుత్వానికి చెల్లించారు. దరఖాస్తుకు 5వేల రూపాయలతో పాటు అదనంగా ఫీజు కింద 250 రూపాయలు చెల్లించి.. తమకు ఇళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసారు. ఒక్క హైదరాబాద్‌లోనే 38 వేల 114 మంది దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో 35 వేల 671 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వాలు మారినా.. నెరవేరని కల

Rajiv Gruhakalpa Scheme in Telangana : మూడు ప్రభుత్వాలు మారినా తమ సొంతింటి కల మాత్రం నెరవేరలేదనే ఆగ్రహం దరఖాస్తుదారుల్లో వ్యక్తం అవుతోంది. ఎంతో మంది అప్పు చేసి తమ భార్య మెడలోని ఆభరణాలు అమ్మి దరఖాస్తు సొమ్ము కింద చెల్లిస్తే.. పద్నాలుగేళ్ల తర్వాత కట్టిన సొమ్ము వాపసు ఇస్తామని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తుదారులతోపాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారు కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్ కాలనీలో తమ రసీదులు అప్పగించేందుకు వచ్చారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం డబ్బు చెల్లించిన వారు తమ రసీదులతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ కార్డు వివరాలతోపాటు 20రూపాయల బాండ్ పేపర్‌ పై అఫిడవిట్ సమర్పించాలంటున్నారని దరఖాస్తుదారులు తెలిపారు.

'2007లో రూ.5వేల డీడీ కట్టి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆ డబ్బు వాపస్ ఇస్తామంటున్నారు. అప్పుడైతే రూ.5వేలకు ఓ ప్లాట్ వచ్చేది. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలి. లేకపోతే మేం నిలువ నీడ లేకుండా రోడ్జున పడాల్సి వస్తుంది.'

- బాధితులు

పట్టించుకునే వారేరి..?

Rajiv Gruhakalpa Scheme Money Return : రాష్ట్ర విభజన అనంతరం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాలలో 990మంది, కోరుట్ల 208, కరీంనగర్‌లో 7,524, సిరిసిల్లలో 211, రామగుండంలో 177 మంది దరఖాస్తు చేసుకున్నారు.

డబ్బిస్తామంటే ఎలా?

ఇళ్లు ఇస్తామని చెప్పి నమ్మించిన ప్రభుత్వం ఇప్పుడు డబ్బు ఇస్తామంటూ అఫిడవిట్‌ తీసుకుంటోంది. అయితే కనీసం ఈ హామీ అయినా నిలబెట్టుకుంటుందా అన్న అనుమానాన్ని దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details