తెలంగాణ

telangana

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఖరారు

By

Published : Jul 1, 2022, 3:24 AM IST

Modi Hyderabad Tour Schedule: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న మోదీ... సాయంత్రం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు నోవాటెల్‌ హోటల్‌లో బస చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది విధులు నిర్వహించనున్నారు.

Modi Hyderabad Tour
Modi Hyderabad Tour

Modi Hyderabad Tour Schedule: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని బయలుదేరతారు. 2 గంటల 55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలికాప్టర్‌లో హెచ్​ఐసీసీ నోవాటెల్ కి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్‌ హోటల్‌లోనే బస చేసే అవకాశం ఉంది.

జూలై 3వ తేదీన ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి వాటి అమలుకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారు. సాయత్రం 5 గంటలకు సమావేశం ముగియనుండగా... ఆరు గంటలకు ప్రధాని సహా అగ్రనేతలంతా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి నోవాటెల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంకు వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రేపు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

జులై 3న నిర్వహించబోయే విజయ సంకల్ప సభను రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరయ్యే సభలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు 18 మందికి ఒక వేదిక, రాష్ట్ర, జాతీయ స్థాయి పదాధికారులకు మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి భారీ భద్రతను కల్పించనున్నారు. ప్రధాన వేదికపై కేవలం 8 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. ప్రధానితో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నుంచి మెుత్తం 14 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హెచ్​ఐసీసీ ప్రాంగణాన్నితమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని నోవాటెల్‌లో బస చేసే అవకాశం ఉండడంతో పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచారు. సుమారు 5 వేల మంది పోలీసులు ప్రత్యక్షంగా విధులు నిర్వహించనున్నారు. మరో 5 వేల మంది ఇతరత్రా పనుల్లో ఉండనున్నారు. హైటెక్స్‌లోనే ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇవాళ ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమావేశ ప్రాంగణం, ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details