ETV Bharat / city

నేడు నడ్డా.. రేపు మోదీ రాక.. హాళ్లకు ప్రత్యేక పేర్లు..

author img

By

Published : Jul 1, 2022, 3:07 AM IST

jp nadda
jp nadda

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాలకు కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నగరం కాషాయమయం అయ్యింది. ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. రెండ్రోజులపాటు జరిగే సమావేశాలకు వివిధ పేర్లను భాజపా నాయకత్వం ఖరారుచేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు.

దాదాపు 18 ఏళ్ల తర్వాత... భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికవుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులతో పాటు 360 మంది జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాలతో పాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జూలై 3న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. స్వాగత కార్యక్రమం అనంతరం కిలోమీటరు వరకు రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం నడ్డా నేరుగా హైటెక్స్‌కు చేరుకుంటారు. అందులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో భేటీ అవ్వనున్నారు. కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ముసాయిదా రూపొందించనున్నారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికే కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ మల్లాపూర్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ లో భాజపా ముఖ్య కార్యకర్తలు సమావేశానికి ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌ హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఇక విశ్వసించబోరని విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్ పల్లి, జక్రాన్ పల్లిలో కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తే పర్యటించారు. భాజపాను అధికారంలోకి తీసుకురావటానికి ప్రతికార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వ్యాఖ్యానించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పదాధికారులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వెళ్లిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌...జాతీయ కార్యవర్గ సమావేశాలపై చర్చించారు. కేసీఆర్ అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రశ్నిస్తామన్నారు.

రేపు, ఎల్లుండి జరిగే వివిధ సమావేశ ప్రాంతాలకు పేర్లను ఖరారు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్.ఐ.సీ.సీ నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా పేరు పెట్టారు. మీటింగ్ ప్లేస్‌కు కాకతీయ ప్రాంగణం... భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా నిర్ణయించారు. మీడియా హాల్‌కి షోయబుల్లా ఖాన్, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా నామకరణం చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు... కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా పేరు పెట్టారు. భాజపా సంఘటన కార్యదర్శుల సమావేశ మందిరానికి కొమురం భీం, ఎగ్జిబిషన్‌కి గొల్లకొండ, తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.