తెలంగాణ

telangana

Nellor Lady Constables Issue: 'యూనిఫాం కొలతలను పురుష టైలర్​తో ఎలా తీయిస్తారు?'

By

Published : Feb 7, 2022, 6:06 PM IST

Nellor Lady Constables Issue: ఏపీ నెల్లూరు మహిళా కానిస్టేబుల్స్ యూనిఫాం కొలతల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మహిళా పోలీసు కానిస్టేబుల్స్ యూనిఫాం కొలతలను పురుష టైలర్​తో ఎలా తీయిస్తారని ప్రశ్నిస్తున్నారు. రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదని నిలదీస్తున్నారు.

Nellor
Nellor

తీవ్ర దుమారం రేపుతున్న యూనిఫాం కొలతల వ్యవహారం

Nellor Lady Constables Issue: వైకాపా ప్రభుత్వంలో మహిళల ఆత్మగౌరవానికి ఎంతలా భంగం కలుగుతుందో తెలిపేందుకు ఏపీ నెల్లూరు ఘటన ఉదాహరణ అని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత అన్నారు. మహిళా పోలీసు కానిస్టేబుల్స్ యూనిఫాం కొలతలను పురుష టైలర్​తో ఎలా తీయిస్తారని ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదివి, కుటుంబపోషణ కోసం పోలీసు వృత్తిలోకి వచ్చిన మహిళల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించారు.

"ఆడపిల్లలకు మన ఇంటి దగ్గర్లోని టైలరింగ్ షాపులో బట్టలు కుట్టించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కొలతలు తీసుకునేవాళ్లు ఆడా, మగా అని వాకబు చేస్తాం. అలాంటిది పోలీస్ యూనిఫాం అనే ఒక్క కారణంటో మహిళా పోలీసుల పట్ల అలా వ్యవహరిసంచటం సరికాదు. మహిళా హోమంత్రి, ముఖ్యమంత్రి, డీజీపీకి ఇంగిత జ్ఞానం ఉందా ? ఇలాంటి మనుషుల మధ్య ఆడపిల్ల బతకాల్సి వస్తోంది. పోలీస్ విభాగంలో పనిచేసే వారికి రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ కల్పిస్తారు..? అందర్నీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వమే మహిళల పట్ల వివక్ష చూపిస్తే ఎలా ?"

- వంగలపూడి అనిత, తెదేపా మహిళా నేత

మహిళలంటే అంత చులకనా..?
రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా..? అని నిలదీశారు. మహిళా పోలీసు యూనిఫాం కొలతలు తీసేందుకు జెంట్ టైలర్లను వినియోగించటం దేనికి సంకేతమన్నారు. మహిళా పోలీసుల పట్ల నెల్లూరు పోలీసు అధికారుల వైఖరిని ఖండిస్తున్నామన్నారు.

బాధ్యత గల పోలీసులే ఇలా చేస్తారా..?
మహిళా పోలీసుల యూనిఫాం కోసం పురుష టైలర్​లను వినియోగించటాన్ని మహిళా సంఘాలు ఖండించాయి. బాధ్యత గల పోలీసులే ఇలా చేయడం తగదని మహిళా సంఘం నేత రెహనా బేగం అన్నారు. మహిళా పోలీసులకు పురుషులతో కొలతలు తీసేందుకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.

ఏం జరిగిందంటే..?
నెల్లూరు పట్టణంలోని ఉమేశ్ చంద్ర హాలులో.. సచివాలయ మహిళా కానిస్టేబుల్స్​కు యూనిఫాం కోసం జెంట్ టైలర్​తో ఉన్నతాధికారులు కొలతలు తీయించారు. పాపం మహిళా పోలీసులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతూనే కొలతలు ఇచ్చారు. వీరంతా.. కావలి, ఆత్మకూరు డివిజన్లకు చెందిన కానిస్టేబుళ్లు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా... ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మహిళలకు పురుష టైలర్​తో కొలతలు తీయించటమేంటి..? మీ ఇంట్లో ఆడవాళ్లకైతే ఇలాగే కొలతలు తీయిస్తారా?" అని ప్రశ్నిస్తున్నారు.

ఎస్పీ ఏమన్నారంటే..?
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయా రావు స్పందించారు. మహిళా పోలీసుల యూనిఫాం బాధ్యతలను ఔట్ సోర్సింగ్​కు అప్పజెప్పామన్నారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే దానిని సరిదిద్దినట్లు తెలిపారు. కొలతలు తీసుకున్న వారిలో మహిళా టైలర్లు.. మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారన్నారు. ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు. మహిళల ప్రైవసీకి భంగం కలిగించినందుకు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details