తెలంగాణ

telangana

Osmania Hospital : ఉస్మానియా ఆసుపత్రిలో నయా శస్త్రచికిత్సలు

By

Published : Apr 25, 2022, 8:17 AM IST

Osmania Hospital : ఒకప్పుడు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులే దిక్కు. చాలా మంది ఆ ఆసుపత్రుల ఖర్చు భరించలేక చికిత్స చేయించుకోకుండా ప్రాణాలు వదిలేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్‌ను మించిన వైద్యం అందుతోంది. సర్కార్ దవాఖానాల్లోనూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో కష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేస్తున్నారు. దానికి నిదర్శనమే నయా శస్త్రచికిత్సలో ఉస్మానియా ఆసుపత్రి రికార్డు.

Osmania Hospital
Osmania Hospital

Osmania Hospital : మోకీళ్లు, తుంటి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలంటే ఒకప్పుడు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులే దిక్కు. అక్కడ లక్షల్లో ఖర్చు పేదలకు మోయలేని భారమే. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో గత 6-7 నెలల్లో 50 వరకు మోకీళ్లు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. మార్చిలో గరిష్ఠంగా 14 శస్త్రచికిత్సలు చేశారు. కిడ్నీ మార్పిడి సమయంలో దాతలకు ఇబ్బంది లేకుండా ల్యాప్రోస్కోపిక్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు సర్జరీలు ఈ విధానంలో చేశారు. దీనివల్ల కిడ్నీ దానం చేసే దాతల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. దీంతో 2-3 రోజుల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. హృద్రోగ రోగులకు గత రెండు నెలల్లో ఇక్కడ 250 వరకు యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్‌ చికిత్సలు అందించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.

మాడ్యులర్‌ థియేటర్లు అత్యవసరం.. :కిడ్నీ, కాలేయ మార్పిడి, ఇతర క్లిష్టమైన సర్జరీలు చేయాలంటే మాడ్యులర్‌(అధునాతన) ఆపరేషన్‌ థియేటర్లు అవసరం. ఉస్మానియాలో ప్రసుత్తం వీటి కొరత వేధిస్తోంది. దీంతో ఏడాదిన్నరగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం లేదు. అత్యవసరమైతే గాంధీలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో 160 మంది వరకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లల్లో కాలేయ మార్పిడి కోసం ఏటా 50 మంది వరకు సంప్రదిస్తుంటారని, థియేటర్ల కొరత కారణంగా ఈ చికిత్సలను వాయిదా వేస్తున్నామని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details