తెలంగాణ

telangana

'కడుపు 'కోత'లు తగ్గించాలి'.. వైద్యులకు హరీశ్ రావు సూచన

By

Published : May 3, 2022, 8:17 AM IST

Harish Rao Latest News: ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 11 వేల 440 కోట్లు కేటాయించి ప్రజలకు అత్యున్నత వైద్య సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆరోగ్యపరంగా దేశంలోనే మొదటి స్థానం చేరేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. వైద్యారోగ్యంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతంగా 57రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Harish Rao
Harish Rao

Harish Rao Latest News: వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వంద శాతం ఉత్తమ సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎక్కడైనా ఒక శాతం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. 99 శాతం చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతంగా అమలు చేయాలని ఆదేశించారు. సర్కారు ఆసుపత్రులను జిల్లా కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. ముఖ్యంగా సిజేరియన్లను తగ్గించడంపై దృష్టిపెట్టాలని, అనవసరంగా వీటిని నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణి దశలో అన్ని పరీక్షలు ఉచితంగా అందించాలన్నారు. ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని, కొవిడ్‌ నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేశారు. వడగాలుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని కోరారు. సోమవారం ఆయన బీఆర్‌కే భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

మొదటి స్థానం దిశగా..‘‘దేశ ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానానికి చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో దేశంలోనే తొలిసారి టిడయాగ్నొస్టిక్స్‌ పేరిట రోగ నిర్ధారణ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా వైద్యులు లేరనే ఫిర్యాదు రావొద్దు. 636 గ్రామీణ, 232 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. వాటిద్వారా జిల్లా కలెక్టర్లు కూడా సేవలను పర్యవేక్షించొచ్చు. అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ వైద్యులు సమయ పాలన పాటించాలి. జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం లభించింది. క్షయ రహిత తెలంగాణ దిశగానూ చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య, డైట్‌ టెండర్లను వెంటనే పూర్తి చేయడంతో పాటు ఎస్సీలకు కేటాయించిన డైట్‌ కాంట్రాక్టులు వారికే దక్కేలా చర్యలు తీసుకోవాలి. కొత్త వైద్య కళాశాలల్లో పనులను వేగవంతం చేయాలి’’ అని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details